Election Commission MHA Meeting :లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) శుక్రవారం కేంద్ర హోంశాఖ, రైల్వే అధికారులతో సమావేశమైంది. దేశవ్యాప్తంగా భద్రతా దళాల తరలింపు, మోహరింపు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు జమ్ముకశ్మీర్‌కూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై హోంశాఖ అధికారులతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
జమ్ముకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గతేడాది డిసెంబరులో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తాజా భేటీలో ఈసీ ఎలాంటి నిర్ణయానికి వచ్చిందన్న దానిపై అధికారిక సమాచారం లేదు. ఈ భేటీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తదితరులు పాల్గొన్నారు.
'ఆ ప్రకటన ఫేక్'
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ ప్రకటన నకిలీదని ఈసీ స్పష్టం చేసింది. తాము ఇప్పటివరకు తేదీలేవీ ప్రకటించలేదని తెలిపింది. మార్చి 12 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం పేరిట ఓ నకిలీ లేఖను కొందరు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఈ నకిలీ ప్రకటనలో మార్చి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 19న పోలింగ్, మే 22న ఓట్ల లెక్కింపు, మే 30 నాటికి ప్రభుత్వ ఏర్పాటు అని పేర్కొన్నారు. ఈ ప్రకటన ఫేక్ అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.