EC On Complaints Against PM Modi :రాజస్థాన్‌లోని బన్స్వారాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై విపక్షాల నిరసనలు వెల్లువెత్తుతుండటం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అప్రమత్తమైంది. ప్రధాని ప్రసంగంలోని వివాదాస్పద అంశాలపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్, సీపీఎం పార్టీలు చేసిన ఫిర్యాదులను పరిశీలించే ప్రక్రియను ఈసీ ప్రారంభించింది.
ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. దేశంలోని ఓ మైనారిటీ వర్గానికే దేశపు ఆస్తులపై తొలి హక్కు ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా ఏళ్ల క్రితం చేసిన ప్రకటనను ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ముస్లిం సమాజానికి వనరులను కేటాయించేందుకు ప్రాధాన్యమిస్తాయని మోదీ ఆరోపించారు.
ఇది ఈసీకి అగ్నిపరీక్ష : కాంగ్రెస్
బన్స్వారాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఓ మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది.''ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల మధ్య విభజనను సృష్టించేలా ఉన్నాయి. అవి ద్వేషపూరిత వ్యాఖ్యలు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఓ మత సమూహాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదు'' అని ఈసీకి కాంగ్రెస్ నేతల బృందం తెలిపింది.