Scissors In Woman Stomach : వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకొచ్చింది. మహిళ పొత్తి కడుపులో శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలు ఉంచి కుట్లు వేసిన విషయం 12 ఏళ్ల తర్వాత బయట పడింది. వెంటనే మహిళకు శస్త్రచికిత్స చేసి ఆ రెండు కత్తెరలను వైద్యులు తొలగించారు. ఆమె ప్రాణాలు కాపాడారు.
వివరాల్లోకి వెళితే, సిక్కింకు చెందిన 45 ఏళ్ల మహిళ 12 ఏళ్ల క్రితం గ్యాంగ్‌టక్‌లోని ఓ ఆస్పత్రిలో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంది. ఆ సమయంలో శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆమె పొత్తికడుపులో రెండు కత్తెరలు మరిచిపోయి కుట్లు వేశారు. అప్పటి నుంచి మహిళ తరచుగా కడుపునొప్పితో బాధపడేది. ఇలా ఎందుకు వస్తుందోనని చాలా మంది వైద్యులను సంప్రదించింది. నొప్పికి గల కారణం తెలియరాలేదు. ఈ నెల 8న ఆమెకు సర్జరీ జరిగిన ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించింది. అక్కడి వైద్యులు ఆమెకు ఎక్స్‌రే తీయగా పొత్తికడుపులో రెండు కత్తెరలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మహిళకు శస్త్రచికిత్స చేసి ఆ రెండు కత్తెరలను తొలగించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
తలకు గాయమైతే పొత్తికడుపుపై సర్జరీ గుర్తులు!
తలకు గాయమై ఆసుపత్రిలో చేరితే పొత్తికడుపుపై శస్త్రచికిత్స చేసిన గుర్తులు ఉన్నాయని ఓ కేసులో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వెలికితీశారు. ఒడిశాలోని కటక్‌లో ఈ ఘటన జరిగింది.
అక్టోబరు 13న బాబులాదిగల్ అనే వ్యాపారి తన భార్య, కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై రాంపూర్‌కు వెళ్తుండగా మినీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబులాదిగల్ తలకు గాయమైంది. కుటుంబసభ్యులు కటక్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి అతణ్ని తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స దుతూ మూడు రోజుల తర్వాత బాబులాదిగల్ మృతిచెందాడు. అంత్యక్రియల సమయంలో అతడి పొత్తికడుపుపై కత్తి గాట్లను గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారి సుశాంత్ సాహు తెలిపారు. బాబులాదిగల్ కుటుంబసభ్యుల ఆరోపణను ఆసుపత్రి మేనేజరు ఖండించారు. ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి ముకేశ్ మహాలింగ్ ఈ వివాదంపై విచారణకు ఆదేశించారు.