Delhi UPSC Coaching Center Incident : భారీ వర్షం కారణంగా సెంట్రల్ దిల్లీలోని ఓ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వచ్చిన వరద నీరు వల్ల ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు తెలంగాణ, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శనివారం సాయంత్రం ఓల్ట్ రాజిందర్ నగర్‌లోని ఓ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో విద్యార్థులు చదువుకుంటున్నారు. వరద నీరు ఒక్కసారిగా పొటెత్తడం వల్ల భవనం అడుగు భాగం జలమయమైంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఐఏఎస్ స్టడీ సెంటర్ నీట మునిగినట్లు తమకు ఫోన్ వచ్చిందని దిల్లీ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే ఐదు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలానికి వెళ్లామని, అప్పటికే బెస్మెంట్ మొత్తం జలమయమై ఉన్నట్లు పేర్కొన్నారు. దిల్లీ అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్ఎఫ్, స్థానికల పోలీసులు కలిసి చేపట్టిన సహాయక చర్యలతో ఇద్దరు మహిళ అభ్యర్థులు, ఒక పురుష అభ్యర్థి మృతదేహాన్ని వెలికితీశామని తెలిపారు. ప్రమాద సమయంలో పలువురు విద్యార్థులను తాళ్ల సాయంతో రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు దిల్లీ పోలీసులు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
విద్యార్థలు ఆందోళనలు
మరోవైపు సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మృతికి నిరసనగా విద్యార్థలు కోచింగ్ సెంటర్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. '10 నిమిషాల పాటు వర్షం కురిసినా ఇక్కడ నీరు నిలిచిపోతుంది. గత 12 రోజులుగా డ్రైనేజీని శుభ్రం చేయాలని కౌన్సిలర్‌ను కోచింగ్ సెంటర్ యజమాని అడుగుతున్నానని అన్నారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్ వాళ్లు 8-10మంది వరకు చనిపోయారని అంటున్నారు. మృతుల సంఖ్య, ఎంతమంది గాయపడ్డారో మాకు తెలియజేయాలి' విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.