తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో భారత మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి అరెస్ట్! అమెరికా అభియోగాలు మోపిన వేళ!!

పన్నూ హత్యకు కుట్ర కేసులో రా మాజీ అధికారి అరెస్ట్

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Ex RAW Agent Arrest
Ex RAW Agent Arrest (ANI)

Ex RAW Agent Arrest :సిక్కు వేర్పాటువాది పన్నూ హత్యకు కుట్ర చేశారంటూ అమెరికా అభియోగాలు మోపిన మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి వికాస్‌ యాదవ్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. దోపిడీ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వికాస్ పరారీలో ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్​బీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ అధికారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే దోపిడీ కేసుకు సంబంధించి గతేడాదిలో అరెస్టయిన వికాస్‌ యాదవ్‌ 7నెలల తర్వాత ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదలైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

న్యూయార్క్​లో కోర్టులో ఛార్జ్​షీట్
పన్నూ హత్య కుట్ర కేసుకు సంబంధించి న్యూయార్క్‌లోని కోర్టులో న్యాయశాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అందులో భారత పౌరుడైన వికాస్‌యాదవ్‌ (39)పై మనీలాండరింగ్‌, కుట్రకు వ్యక్తులను నియమించడం, పన్నూ హత్యకు ప్రణాళిక రచించడం వంటి అభియోగాలు మోపింది. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియరావడం లేదని ఛార్జ్​షీట్​లో పేర్కొంది. వికాస్‌ గతంలో భారత ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహించారు. భారత విదేశీ ఇంటిలెజెన్స్‌ విభాగం, రా విభాగాన్ని నిర్వహించే కేబినెట్‌ సెక్రటేరియట్‌లో ఉద్యోగిగా పనిచేశారు.

అమెరికా గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని అగ్రరాజ్యం గతేడాది ఆరోపించింది. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేసేందుకు నిఖిల్‌ గుప్తా కుట్ర పన్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఇప్పటికే చెక్‌ రిపబ్లిక్‌ జైలులో ఉన్న నిఖిల్‌ను అమెరికాకు అప్పగించినట్లు ఆ మధ్య మీడియా కథనాలు వెల్లడించాయి. అటు ఈ కేసు వ్యవహారంపై అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు కూడా జారీ చేసింది.

దర్యాప్తు కమిటీ ఏర్పాటు
అయితే, ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్‌ దీనిపై విచారణ జరిపేందుకు స్వదేశంలో ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేసింది. ఈ క్రమంలోనే ఇటీవల భారత అధికారుల బృందం అమెరికాలోని విదేశాంగ శాఖ, న్యాయశాఖ అధికారులతో సమావేశమైంది. ఈ అభియోగాల్లో పేర్కొన్న భారత అధికారి ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేయడం లేదని న్యూదిల్లీ తమకు వెల్లడించినట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. ఈ బృందం పర్యటన ముగిసిన తర్వాతే వికాస్‌ యాదవ్‌పై అగ్రరాజ్యం అభియోగాలు చేయడం గమనార్హం.

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details