Kolkata Doctor Case :కోల్‌కతా ఆస్పత్రిలో జరిగిన హత్యాచార ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ కేసును బంగాల్ పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని, తృణమూల్ కాంగ్రెస్ సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆందోళనకారులు ఆరోపిస్తున్న తరుణంలో సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ పాదయాత్ర నిర్వహించారు. హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలు లేకుండా చేసేందుకే ఆర్‌జీ కర్ ఆస్పత్రిపై ప్రతిపక్ష సీపీఎం, బీజేపీ దాడి చేశాయని మమత ఆరోపించారు.
ఉరి తీయాలని దీదీ డిమాండ్
జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనలో వాస్తవాలను మరుగుపర్చేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లు మమత విమర్శించారు. ఇలాంటి చర్యలను ఖండిస్తున్నట్లు దీదీ తెలిపారు. నేరానికి పాల్పడినవారిని ఉరి తీయాలన్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తును ఆమె ప్రశంసించారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఆదివారం నాటికి దోషులెవరో తేల్చాలని మమతా బెనర్జీ కోరారు. మరోవైపు, ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ శుక్రవారం బంగాల్ అంతటా ర్యాలీలు, ధర్నాలు చేపట్టింది.
ఆస్పత్రిపై దాడి- హైకోర్టు ఏమందంటే?
బుధవారం అర్ధరాత్రి కోల్‌కతా ఆస్పత్రిపై జరిగిన దాడి ఘటనపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే కారణమని ఆక్షేపించింది. ఏడు వేలమంది గుమిగూడితే అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల మధ్య వైద్యులు విధులు ఎలా నిర్వహిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.