Maharashtra Elections Modi Kharge :మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వరుస కార్యక్రమాలు ఏర్పాటు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా అకోలాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు, నాగ్‌పుర్‌లో జరిగిన ఎన్నికల సభలో బీజేపీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.
మహావికాస్ అఘాడీ అంటే అవినీతి, కుంభకోణాలకు నెలవు!
నవంబరు 9కి చరిత్రలో అత్యంత ప్రాధాన్యం ఉందని మోదీ తెలిపారు. 2019లో సరిగ్గా ఇదేరోజు సుప్రీంకోర్టు రామమందిరంపై తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఆ తీర్పు తర్వాత ప్రతి మతంలోని ప్రజలు గొప్ప సున్నితత్వాన్ని ప్రదర్శించారని వ్యాఖ్యానించారు. "దేశానికే తొలి ప్రాధాన్యం అనే భావన భారత్‌కు ఉన్న గొప్ప బలం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటైతే ఆ రాష్ట్రాన్ని తమకు ఏటీఎంగా మార్చుకుంటుంది. మహావికాస్ అఘాడీ అంటే అవినీతి, కుంభకోణాలకు నెలవు. కర్ణాటకలో మద్యం విక్రయదారుల నుంచి రూ.700 కోట్లు కొల్లగొట్టారు. ఎన్నికల్లో గెలిస్తే ఇంకెంత దోచుకుంటారో ఊహించండి" అంటూ ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు.
హరియాణా ప్రజలు కాంగ్రెస్ కుట్రను భగ్నం చేశారని మోదీ తెలిపారు. దేశాన్ని బలహీనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వివిధ కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తోందని, మనమంతా ఐక్యంగా ఉండి వారి కుట్రను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీల హక్కులను హస్తం పార్టీ హరిస్తోందని ఆరోపించారు. "పదేళ్లలో కేంద్రం పేదలకు పక్కా ఇళ్లు నిర్మించింది. మీరు ఇతర గ్రామాలను సందర్శినప్పుడు ఇల్లు లేని వారు, గుడిసెల్లో నివసించేవారు కనిపిస్తే వారి వివరాలతో సహా చిరునామాను నాకు పంపించండి. అతడికి శాశ్వతంగా ఒక ఇల్లు సొంతం అవుతుందని నా తరఫున హామీ ఇవ్వండి. కచ్చితంగా ఆ హామీని నేను నెరవేరుస్తా. ఎన్నికల్లో మహాయతి కూటమిని గెలిపిస్తారని ఆశిస్తున్నా" అని పేర్కొన్నారు మోదీ.
ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని!
మరోవైపు, రెచ్చగొట్టే ప్రసంగాలు, అబద్ధాల ద్వారా ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని బీజేపీ మళ్లిస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు మంచి ప్రభుత్వం అవసరమని అన్నారు. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
విదర్భకు చెందిన ఇద్దరు పెద్ద నాయకులు తమ సొంత పదవులను కాపాడుకోవడంపై ఆందోళన చెందుతూనే ఉంటారని ఆరోపించారు. అందుకే ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేకుండా గుజరాత్‌కు వెళ్లిపోతున్న పెద్ద పెట్టుబడులను ఆపలేకపోయారని విమర్శించారు. గత 11 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏ పని చేసిందో చెప్పాలని, కాంగ్రెస్‌తో బీజేపీ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. 55 ఏళ్లలో తామేం చేసేమో చెబుతామని అన్నారు. కాగా, 288 మంది శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలు వెలువడనున్నాయి.