Haryana Elections 2024 Congress :హరియాణా శాసనసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టోను ప్రకటించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. క్రిమీలేయర్‌ను ప్రస్తుతమున్న రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని తెలిపింది. సాత్ వాదే పక్కే ఇరాదే పేరుతో ఏడు గ్యారంటీలను దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా విడుదల చేశారు.
18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు నెలకు 2 వేల రూపాయలతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లను ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు 6 వేల రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఇల్లు లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 100 చదరపు గజాల స్థలం, నిర్మాణం కోసం రూ.3.5 లక్షలు ఇస్తామని తెలిపింది. అయితే తాము హామీలను తప్పక అమలు చేస్తామని ఖర్గే తెలిపారు. అందుకే సాత్ వాదే పక్కే ఇరాదే అని పేరు పెట్టామని చెప్పారు.