Congress Party Manifesto :వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రవేశపెట్టే మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత చర్చలను ముగించనుంది. నిరుద్యోగ సమస్యకు పరిష్కారమే లక్ష్యంగా అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రాం సహా మరికొన్ని వినూత్న కార్యాచరణలను ఎన్నికల ప్రణాళికలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సీడబ్ల్యూసీ ఆమోదమే తరువాయి
కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం సారథ్యం వహిస్తున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న మిగతా సీనియర్ నేతలు ప్రియాంకా గాంధీ వాద్రా, శశి థరూర్, ఆనంద్ శర్మ సహా మరికొందరు కీలక వ్యక్తులు ఉన్నారు. వీరంతా సమావేశమై అంతర్గత చర్చలను ముగించారు. మేనిఫెస్టో కమిటీ కీలక సభ్యులు మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాగా, మేనిఫెస్టో కమిటీ 50 పేజీల నివేదికను పార్టీ అధిష్ఠానానికి సమర్పించనుండగా కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ) తుది ఆమోదం తెలపనుంది.
"మేము రూపొందించిన మేనిఫెస్టో కేవలం డ్రాఫ్ట్ మాత్రమే. ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ముందుకు వెళ్తుంది. దీనిని సీడబ్ల్యూసీ ఆమోదించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ అధికారిక మేనిఫెస్టోగా మారుతుంది. ఇదే విషయమై పార్టీ అధ్యక్షుడితో పాటు మరికొందరు సీనియర్ నేతలను బుధవారం కలిసేందుకు అపాయింట్మెంట్ కోరనున్నాము."
- పి.చిదంబరం, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు