Amit Shah On Congress : కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి అని, కుమారి సెల్జా వంటి పలువురు నేతలను అవమానించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వలేదని అన్నారు. తాము ఆయనను గౌరవించేందుకు పంచతీర్థాన్ని స్థాపించామని, సంవిధాన్ దివస్ ప్రకటించామని తెలిపారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తోహాణాలో సోమవారం నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న షా, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
"అభివృద్ధి తర్వాత రిజర్వేషన్లు అవసరం లేదని రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడారు. వారి (కాంగ్రెస్) అభివృద్ధి తర్వాత రిజర్వేషన్లను ఎత్తివేస్తారు. మన హరియాణా పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. మీకు రిజర్వేషన్లు కావాలా వద్దా? ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లను రక్షించగల వ్యక్తి ఎవరైనా ఉంటే అది ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే. పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే. బీజేపీ అధికారంలోకి రాకముందు లంచం తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు."
-- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి