Cong Chief Writes To President Murmu On Manipur Situation :మణిపుర్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు రాష్ట్రపతికి రెండు పేజీల లేఖ రాశారు. మణిపుర్ ప్రజలు ప్రశాంత వాతావరణంలో, గౌరవంగా తమ ఇళ్లలో జీవించేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రపతి ముర్మును కోరారు. గత 18 నెలలుగా మణిపుర్ ప్రజలకు భద్రత కల్పించడంలోనూ, శాంతిభద్రతల పరిరక్షణలోనూ కేంద్రం, మణిపుర్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఖర్గే ఆరోపించారు. హింసాత్మక ఘటనల్లో మహిళలు, పిల్లలు, నవజాత శిశువులు సహా 300 మంది ప్రాణాలు కోల్పోయారని ఖర్గే పేర్కొన్నారు. పైగా లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, బలవంతంగా తమ ఇళ్లను వదిలి శిబిరాల్లో తలదాచుకుంటున్నారని రాష్ట్రపతికి రాసిన లేఖలో ఖర్గే వివరించారు.
రక్షణ కల్పించండి!
మణిపుర్ ప్రజల వేదన కొనసాగుతూనే ఉందని ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా వెంటనే జోక్యం చేసుకుని మణిపుర్ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని ఖర్గే రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతి జోక్యంతో మణిపుర్ ప్రజలు మళ్లీ తమ ఇళ్లలో గౌరవంగా, ప్రశాంత వాతావరణంలో జీవించే పరిస్థితులు తిరిగి నెలకొంటాయని ఖర్గే ఆశాభావం వ్యక్తంచేశారు.