Man Got Bribe Money After Many Years: తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యక్తి 28 ఏళ్ల తర్వాత లంచంగా ఇచ్చిన రూ.500ను తిరిగి పొందాడు. ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం ఇచ్చిన డబ్బులు తాజాగా అతడికి ముట్టాయి. సొంత డబ్బులను పొందేందుకు ఏళ్ల తరబడి వేచిచూడాల్సి వచ్చిందని ఆ వ్యక్తి అహసనం వ్యక్తం చేశాడు.
అసలేం జరిగిందంటే?
కోయంబత్తూరు జిల్లాలోని వాడవల్లి ప్రాంతానికి చెందిన కతిర్మతియోన్ సామాజిక కార్యకర్త. 1996లో తన ఇంటికి కరెంటు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా, విద్యుత్ బోర్డు అధికారులు రూ.500 లంచం అడిగారు. దీనిపై అవినీతి నిరోధక శాఖకు కతిర్మతియోన్ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పక్కాగా ప్లాన్ చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రూ.100 నోట్లు నాలుగు, రూ.50 నోట్లు రెండింటికి రసాయనాలు పూసి కతిర్మతియోన్తో విద్యుత్ అధికారికి లంచంగా ఇప్పించారు. ఆ సమయంలో దాడులు జరిపి విద్యుత్ అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో కతిర్మతియాన్ ఇచ్చిన రూ.500ను సాక్ష్యంగా కోర్టుకు అందజేశారు.
ఈ కేసు 2001లో ముగిసింది. అయితే కతిర్మడియన్ లంచంగా ఇచ్చిన రూ.500 అతనికి తిరిగి అందలేదు. దీంతో అతడు 2007లో కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో ఆయనకు కోర్టు నుంచి రూ.500 అందుకోమని లేఖ వచ్చింది. కాగా, 1996లో విద్యుత్ కనెక్షన్ కోసం అధికారికి కతిర్మతియాన్ ఇచ్చిన కరెన్సీ నోట్లు ప్రస్తుతం చెలామణిలో లేవు.
"1996లో కోయంబత్తూరు గణపతి ప్రాంతంలోని నా ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. అప్పట్లో రూ.100 రుసుము చెల్లించాను. మరో రూ.400 లంచంగా ఇవ్వాలని విద్యుత్ అధికారి డిమాండ్ చేశారు. అప్పుడు నేను అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశాను. ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం అడిగిన అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తర్వాత అతడ్ని కోర్టులో హాజరుపర్చారు. నేను ఇచ్చిన నోట్లను కూడా సాక్ష్యంగా సమర్పించారు. ఇటీవలే కోర్టు నుంచి నాకు లేఖ వచ్చింది. నేను ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకోవాలని అందులో ఉంది."