How To Book Circular Journey Ticket :నిత్యం లక్షల సంఖ్యలో ప్రజలు తమ గమ్యస్థానాన్ని చేరుకోవటానికి ట్రైన్ జర్నీని ఎంచుకుంటుంటారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగడం అందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, సాధారణంగా ఎవరమైనా రైలులో ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు.. వెళ్లాల్సిన గమ్యానికి ఒక టికెట్, రావడానికి మరో టికెట్, ఇతర ప్రదేశాలకు వెళ్తే ఇంకో టికెట్ బుక్ చేసుకుంటాం. కానీ, ఇండియన్ రైల్వే(Indian Railway) అందిస్తోన్న "సర్క్యులర్ జర్నీ టికెట్" తీసుకుంటే.. ఒకే టికెట్ ద్వారా ఏకంగా 56 రోజుల పాటు రైలులో ప్రయాణించవచ్చు. అసలేంటి, ఈ టికెట్? దీనిని ఎలా బుక్ చేసుకోవాలి? ధర ఎలా లెక్కిస్తారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సర్క్యులర్ జర్నీ టికెట్ అనేది.. ఒక స్పెషల్ టికెట్. మీరు ఏ క్లాసులోనైనా దీన్ని తీసుకోవచ్చు. ఈ టికెట్‌లో గరిష్ఠంగా 8 జర్నీలు ఉంటాయి. అంటే.. ఒక చోట మీ జర్నీని స్టార్ట్ చేసి.. 56 రోజులపాటు దేశంలో ఎక్కడైనా తిరిగి.. మళ్లీ మీరు ప్రయాణం ప్రారంభించిన చోటుకు చేరుకోవచ్చు. అయితే.. మధ్యలో మీరు దిగే స్టేషన్ల సంఖ్య 8కి మించకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక స్టేషన్లో దిగి.. ఆ ప్రాంతంలో కొన్ని రోజులు గడిపి.. ఆ తర్వాత మరో ప్రదేశానికి మీ ప్రయాణాన్ని కంటిన్యూ చేయవచ్చు.
ఉదాహరణకు ఇలా చూద్దాం..
మీరు హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై వెళ్లి రావడానికి టికెట్ తీసుకున్నారనుకుందాం. అప్పుడు హైదరాబాద్ నుంచి మొదలైన మీ జర్నీ.. చాలా స్టేషన్లు దాటుకుంటూ తిరుపతి రీచ్ అవుతుంది. ఆ టైమ్లో మీరు తిరుపతిలో దిగి.. కొన్ని రోజులు అక్కడి సమీపంలోని ప్రదేశాలను చూసి.. మళ్లీ బెంగళూరుకు రైలు ఎక్కొచ్చు. మళ్లీ బెంగళూరు వెళ్లాక అక్కడ కొన్ని రోజులు గడపొచ్చు. ఆ తర్వాత.. చెన్నై వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి.. ఆపై మీ రిటర్న్ జర్నీ ప్రారంభించొచ్చు. అంతేకాదు.. తిరిగి హైదరాబాద్కు చేరుకునే క్రమంలో.. మీరు ఎక్కడైనా దిగాలనుకుంటే.. అక్కడ దిగేయొచ్చు. అలాగే ఆ ప్రాంతం నుంచి రిటర్న్ జర్నీ కంటిన్యూ చేయవచ్చు. ఈవిధంగా.. రాకపోకల సమయంలో మీకు మొత్తం 8 చోట్ల దిగి, ఎక్కే అవకాశం ఉంటుంది. అందుకోసం.. ఏయే స్టేషన్లలో రైలు దిగుతారనేది సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే, 56 రోజుల లోపల మీ జర్నీ ముగించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.