CEC Rajiv Kumar Briefs Observers :ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించడంపై కేంద్ర పరిశీలకులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్‌కుమార్ ఆదేశించారు. అణిచివేతలు, ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రతినిధులుగా రాష్ట్రాలకు వెళ్తున్నవారు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, ఎన్నికల ప్రక్రియతో ముడిపడిన ఇతర భాగస్వాములకు అందుబాటులో ఉండాలని సూచించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలకు పంపే పరిశీలకులకు, కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం దిల్లీలో ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించింది. విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌తో పాటు కేంద్ర సర్వీసులకు చెందిన 2,150 మంది సీనియర్ అధికారులు ప్రత్యక్షంగా, వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రానున్న ఎన్నికల కోసం 900 సాధారణ, 450 పోలీస్, 800 మంది వ్యయ పరిశీలకులను ఈసీ రాష్ట్రాలకు పంపుతోంది.
ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడం సహా అన్ని రాజకీయపార్టీలు, అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించడానికి పరిశీలకులు చర్యలు తీసుకోవాలని సీఈసీ రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడానికి వీలుగా అందరూ పోలింగ్ బూత్‌లను పరిశీలించి అక్కడున్న సున్నితమైన ప్రాంతాలపై అవగాహన పెంచుకోవాలని నిర్దేశించారు.
కేంద్ర పరిశీలకుల విధులు
- ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి పరిశీలకుడు తమకు కేటాయించిన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే ఉండాలి. ఇందుకోసం వారి వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అమరుస్తున్నారు.
- ప్రతి పరిశీలకుడూ తాను బస చేసిన చోటు, మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లను అందరికీ అందుబాటులో ఉంచాలి. అలాగే తన వివరాలను సీఈఓ, జిల్లా వెబ్‌సైట్లు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచురించాలి. తన వివరాలు అన్నింటినీ ఎన్నికల్లో పాల్గొంటున్న అందరు అభ్యర్థులకు, గుర్తింపు పొందిన రాజకీయపార్టీలకు కచ్చితంగా అందించాలి.
- రాజకీయపార్టీలు, అభ్యర్థులు, సాధారణ ప్రజలు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తమ సమస్యలను, ఫిర్యాదులను చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఫోన్ నంబర్, ఈ-మెయిల్స్ ఏర్పాటు చేయాలి.
- జిల్లా ఎన్నికల అధికారులు నిబద్ధత గల వారిని మాత్రమే కేంద్ర పరిశీలకుల వెంట లైజన్ ఆఫీసర్లు, సెక్యూరిటీ ఆఫీసర్లుగా పంపాలి. భద్రతాబలగాల మోహరింపు, వారి ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా ప్రత్యక్షంగా పరిశీలించాలి.
- అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలి. ఇందుకోసం 'సువిధ పోర్టల్'ను ఉపయోగించుకోవచ్చు.
- నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అందువల్ల కేంద్ర భద్రతా బలగాలను, రాష్ట్ర పోలీసులను న్యాయబద్ధంగా ఉపయోగిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలకులు చూడాలి. ముఖ్యంగా భద్రతా బలగాల, పోలీసుల మోహరింపు ఏదో ఒక రాజకీయపార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఉండకుండా చూడాలి.
- సున్నితమైన, దుర్భలమైన ప్రాంతాల్లో భద్రత పెంచాలి. అలాగే సదరు ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లను సాధ్యమైనంత ఎక్కువగా పరిశీలించాలి. అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి చొరవ తీసుకోవాలి.
- రాజకీయపార్టీలతో, ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు డీఈఓలు, ఆర్‌ఓలు సమావేశాలు నిర్వహిస్తుంటారు. వీటిని కూడా పరిశీలకులు పర్యవేక్షించాలి.
- పార్టీలు, అభ్యర్థులు చేసే ఫిర్యాదులు చేసినప్పుడు, సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారా? లేదా? అనేది కూడా పరిశీలకులు గమనించాలి.
CAA అమలుతో ఏమవుతుంది? కొత్త చట్టంపై నిరసనలకు కారణమేంటి?
'ఎన్నికల ముందు ఓట్లు చీల్చే ప్రయత్నం'- CAA అమలుపై విపక్షాలు ఫైర్