Bengal Doctor Rape Murder Case Updates :ఆర్జీ కర్ వైద్య కళాశాలకు చెందిన జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో కోల్‌కతా పోలీసులపై సీబీఐ పలు ఆరోపణలు చేసింది. నిందితుడు సంజయ్ రాయ్‌కు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. హత్యాచారంలో నిందితుడి ప్రమేయం ఉందని తెలిసినా అతడికి సంబంధించిన దుస్తులను ఘటన జరిగిన 2 రోజుల తర్వాత స్వాధీనం చేసుకున్నారని ఆరోపించింది. దీంతో ఆధారాల సేకరణ కష్టంగా మారిందని స్పష్టం చేసింది.
కీలక ఆధారాలు నాశనం!
ఆర్జీ కర్ వైద్యకళాశాలకు చెందిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసును విచారిస్తున్న సీబీఐ పలు కీలక విషయాలను వెల్లడించింది. నిందితుడు సంజయ్ రాయ్‌కు చెందిన దుస్తులను స్వాధీనం చేసుకోవడంలో కోల్‌కతా పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించింది. హత్యాచారంలో నిందితుడి ప్రమేయం ఉందని తెలిసినా, అతనికి సంబంధించిన దుస్తులు, వస్తువులను ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. ఘటన జరిగిన రోజే దుస్తులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని ఉంటే బలమైన సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉండేదని పేర్కొంది. అప్పుడు కేసులో కొంత వరకు పురోగతి కనిపించేదని వెల్లడించింది. ఆర్జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ మోండల్‌లు సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నించారని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. సందీప్ ఘోష్, అభిజిత్ మోండల్‌లకు నిందితుడితో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో సీబీఐ విచారణ చేస్తోంది.