NEET UG Paper Leak CBI :నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పాత్రధారులైన మరో ఇద్దరు నిందితులను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) శనివారం అరెస్టు చేసింది. ఇద్దరు రాజస్థాన్ భరత్‌పుర్ మెడికల్ స్కూల్‌కు చెందిన ఎమ్‌బీబీఎస్ విద్యార్థులని అధికారులు తెలిపారు. వారిని మంగళం బిష్ణోయ్ శర్మ, దీపేందర్ శర్మగా పోలీసులు గుర్తించారు. దీంతో పేపర్ లీక్ కేసులో అరెస్టైనవారి సంఖ్య 21కి చేరింది.
రీ టెస్ట్ రిజల్ట్
అంతకుముందు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరాలు, పరీక్ష కేంద్రాలవారీగా నీట్ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ- NTA వెల్లడించింది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్తపడింది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కిపైగా పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ D.Y.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విడుదల చేయాలని NTAను ఆదేశించింది.
మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికే ఈ జాబితా విడుదల చేయాలని కోరుతున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. ఫలితాలను NTA వెబ్ సైట్లో అప్లోడ్ చేయాలనీ విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సూచించింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జులై 22న ధర్మాసనం తదుపరి విచారణ చేపట్టనుంది.