CAA Effect On Indian Muslims : పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై భారతదేశంలోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హిందువులతో సమానంగా, ముస్లింల హక్కులు కొనసాగుతాయని పేర్కొంది. దేశంలోని 18 కోట్ల మంది ముస్లింలు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఏ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ప్రకటన విడుదల చేసింది.
ఇస్లాంను చట్టం రక్షిస్తుంది!
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లలో పీడనకు గురైన ముస్లిమేతరులు, మైనారిటీలు 2014 డిసెంబరు 31లోగా ఇండియాకు వచ్చి ఉన్నట్లయితే వారికి సీఏఏ-2019 చట్టం ప్రకారం, భారత పౌరసత్వాన్ని కల్పించనున్నారు. అయితే సీఏఏపై భారతీయ ముస్లింలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం మరింత స్పష్టతనిచ్చింది.
"పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల్లో మైనారిటీలు పీడనకు గురి కావడం వల్ల ఇస్లాం అనే పదానికి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అపనింద వచ్చింది. నిజానికి ఇస్లాం శాంతికాముక మతం. విద్వేషం, హింస, పీడనలను అది ఎన్నడూ ప్రబోధించలేదు. అందుకే ఈ కళంకం నుంచి ఇస్లాం మతాన్ని సీఏఏ చట్టం రక్షిస్తుంది. భారతదేశంలోకి వలసవచ్చిన శరణార్థుల్ని వెనక్కి పంపేందుకు పొరుగున ఉన్న ఈ మూడు ముస్లిం దేశాలతో మనకెలాంటి ఒప్పందం లేదు. అక్రమ వలసదారులను వెనక్కి పంపే అంశమే ఈ సీఏఏ చట్టంలో లేదు. కనుక ముస్లింలు అపోహ పడాల్సిన అవసరం లేదు."
- కేంద్ర హోంశాఖ
"భారతదేశంలోనికి అక్రమంగా వలస వచ్చిన వారిని, విదేశీయులుగానే గుర్తించడం జరగుతుంది. పౌరసత్వ చట్టం-1955 మాదిరిగానే సీఏఏ కూడా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా భారత్‌లో అడుగుపెట్టిన వారిని విదేశీయులుగానే గుర్తిస్తుంది. ముస్లింలు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించదు. ఏ దేశానికి చెందిన ముస్లింలైనా పౌరసత్వ చట్టం సెక్షన్-6 కింద ఇండియన్ సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అది సహజసిద్ధమైన పౌరసత్వాన్ని పరిశీలిస్తుంది" అని కేంద్ర హోంశాఖ తెలిపింది.