Bus On House Roof :ఇంటిపైకప్పుపై ఏకంగా ఓ బస్‌ను ఏర్పాటు చేశారు విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి. ప్రస్తుతం ఆ బస్ చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. అచ్చం బస్సులో ఉన్నట్లుగానే స్టీరింగ్, సీట్లు, లైట్లు ఇలా అన్నీ ఏర్పాటు చేశారు పంజాబ్‌కు చెందిన రేషమ్సింగ్. కంగ్సాహెబ్ ప్రాంతానికి చెందిన రేషమ్సింగ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందారు. బస్సులంటే ఎంతో ఇష్టపడే రేషమ్ సింగ్, తన ఇంటిపైనే ఆ తరహా నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని భావించారు.
"నేను పీఆర్టీసీ టెక్నికల్ విభాగంలో సుదీర్ఘ కాలం పాటు సేవలందించాను. ఇంటిపై బస్సును ఏర్పాటు చేయాలనేది నా కల. దీనిని 2018 నుంచే ఈ పని ప్రారంభించా. అయితే కొవిడ్ వల్ల నేను అనారోగ్యానికి గురవ్వడం వల్ల పనులకు కొంత ఆటంకం కలిగింది. అనంతరం కొవిడ్ నుంచి కోలుకుని బస్సు పనిని తిరిగి ప్రారంభించాను.". - రేషమ్ సింగ్, పీఆర్టీసీ మాజీ ఉద్యోగి
విధి నిర్వహణలో తనకు లభించిన మెమొంటోలను బస్సులో అందంగా అలంకరించారు రేషమ్సింగ్. తనతో కలిసి పనిచేసిన తోటి సహోద్యోగుల పేర్లను బస్సులో రాశారు. వీటితో పాటు బస్ లోపల టీవీని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం బస్ నిర్మాణం కోసం సుమారు రూ.2.5 లక్షల వెచ్చించినట్లు చెబుతున్నారు. ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న ఈ బస్సును తన వారసులు పరిరక్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.