Budget 2024 Total Details In Telugu :మోదీ సర్కారు హయాంలో పదేళ్ల ప్రగతిని ప్రస్తావిస్తూనే వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన అభివృద్ధికి బాటలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల తాయిలాలకు ఏలాంటి చోటు లేకుండానే పద్దును ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పేద, మధ్యతరగతి సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 47లక్షల 65వేల 768 కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. అత్యధికంగా రక్షణ రంగానికి 6లక్షల 20వేల కోట్లు కేటాయించారు.
నెక్స్ట్ జనరేషన్ రిఫామ్స్
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ పద్దును తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, మరోసారి వికసిత్ భారత్ మంత్రం జపించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వివరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అందుకు వ్యూహాలను ఆవిష్కరిస్తూ బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. వచ్చే ఐదేళ్లలో వేగవంతమైన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా నెక్స్ట్ జనరేషన్ రిఫామ్స్ తీసుకొస్తున్నట్లు మంత్రి వివరించారు.
గేమ్ ఛేంజర్ IMEC
ఈ 25 ఏళ్లను అమృత్ కాలంగా భావిస్తుండగా, ఇటీవల ప్రకటించిన భారత్-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక కారిడార్ దేశ ప్రగతి గతిని మారుస్తుందని నిర్మల తెలిపారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల (రూ.47,65,768) రూపాయల అంచనాలతో బడ్జెట్ ప్రకటించిన ఆర్థిక మంత్రి విత్త లోటు 5.1 శాతంగా ఉంటుందని తెలిపారు. మూలధన వ్యయం 11 శాతంగా ఉంటుందని చెప్పిన మంత్రి ఇది 11లక్షల 11 వేల కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అభివృద్ధి భారత్ లక్ష్యంలో భాగంగా రాష్ట్రాలకు రూ.75వేల కోట్లు వడ్డీలేని రుణాల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవన్న మంత్రి ఎగుమతి, దిగుమతి సుంకాల్లోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. బడ్జెట్‌లో రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు కేటాయింపులు చేశారు.
3కోట్ల ఇళ్ల నిర్మాణం
మధ్యతరగతి నూతన గృహ నిర్మాణ విధానం అందుబాటులోకి తెస్తున్నామని సీతారామన్ చెప్పారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకంలో భాగంగా మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని చెప్పారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేళ్లు కూడా ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు.
రైతులకు పెద్దపీట
పీఎం స్వనిధి ద్వారా ఇప్పటివరకు 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశామని, దీని కింద మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువులు అందిస్తామని చెప్పారు. ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు.
ఆయుష్మాన్ భారత్ యోజన కింద అంగన్వాడీలు
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 9 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో మెడికల్ కాలేజీల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
వందేభారత్ ప్రమాణాలతో 40 వేల సాధారణ బోగీలు
ఈ బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. అలానే రైల్వేలపై కీలక ప్రకటనలు చేశారు. 40 వేల సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలతో మార్పు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మూడు కొత్త రైల్వే ఆర్థిక కారిడార్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రైలు మార్గాల్లో హైట్రాఫిక్, హైడెన్సిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు మెరుగుపర్చనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.
కొత్త విమాన సర్వీసులు
విమానయాన రంగంలో 2, 3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులు తీసుకొస్తామని చెప్పారు నిర్మల. మన విమానయాన సంస్థలు 1000 విమానాలకు పైగా ఆర్డర్ చేశాయని తెలిపారు. ఈ ఆర్డర్లే దేశ విమానయాన రంగ అభివృద్ధిని తెలియజేస్తున్నాయని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్స్, ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించాస్తామని తెలిపారు. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అందించడానికి బయో మ్యానుఫ్యాక్చరింగ్, బయో ఫౌండరీ పథకం కింద బయో డిగ్రేడబుల్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.