తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫ్రెండ్​ను ఇరికించేందుకు విమానాలకు బెదిరింపులు- బిజినెస్​ మ్యాన్ కొడుకు పనే!

స్నేహితుడిని ఇరికించేందుకు విమానాలకు బెదిరింపులు- పోలీసుల అదుపులో మైనర్‌!

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Bomb Threat To Flights
Bomb Threat To Flights (ANI)

Bomb Threat To Flights : దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు ఆగడం లేదు. గడిచిన మూడు రోజుల్లో మొత్తంగా 19 విమానాలు భద్రతా ముప్పును ఎదుర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో గడిచిన 24 గంటల్లోనే 9 విమానాలకు ఈ తరహా ఘటనలు జరిగాయి. ఇవన్నీ కూడా నకిలీవేనని వెల్లడైనప్పటికీ ఈ ఘటనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

ముంబయి నుంచి బయలుదేరిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన ఘటనల్లో నిందితుడు ఓ బాలుడని తేలింది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానాలకు భద్రతా ముప్పు ఉందంటూ పోస్టులు పెట్టిన ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు వాటి మూలాలు ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉన్నట్లు గుర్తించారు. ఓ వ్యాపారవేత్త కుమారుడు (17) సోషల్‌ మీడియాలో ఈ పోస్టులు పెట్టినట్లు కనుగొన్నారు. ఈ కేసులో ఆ వ్యాపారవేత్తకు సమన్లు పంపించిన పోలీసులు మైనర్‌ను అదుపులోకి తీసుకొని ముంబయి తరలించారు. నగదు విషయంలో గొడవ పడిన ఓ స్నేహితుడిని ఇరికించేందుకు ఆ బాలుడు ఇదంతా చేసినట్లు తెలుస్తోంది.

విమానాల బెదిరింపు ఘటనలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. సంబంధిత దర్యాప్తు సంస్థలు ఆయా కేసులపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయని అన్నారు. మూడు విమానాలకు ఈ విధమైన బెదిరింపులకు పాల్పడిన ఓ మైనర్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారని ధ్రువీకరించారు. విమానయాన సంస్థలు, ప్రయాణికుల రక్షణే లక్ష్యంగా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

మరో 7 విమానాలకు!
బుధవారం మొత్తం 7 విమానాలకు బాంబు బెదిరింపులొచ్చాయి. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరికొన్ని దారి మళ్లాయి. ఇండిగోకు చెందిన రియాద్‌-ముంబయి విమానాన్ని బుధవారం ఉదయం వచ్చిన బెదిరింపులతో మస్కట్‌కు దారి మళ్లించారు. అక్కడి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండయినట్లు, ప్రయాణికులందరినీ క్షేమంగా దించినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. మరో ఘటనలో దిల్లీ నుంచి 180 మందితో బుధవారం మధ్యాహ్నం బెంగళూరు బయలుదేరిన ఆకాశ ఎయిర్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని వెనక్కు మళ్లించి దిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. విమానాలకు బాంబు బెదిరింపులు రావడంపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details