Central Approves Seven National Highway Project works in AP : ఏపీలో భారతమాల పరియోజన మొదటి దశ కింద మంజూరైన ఏడు జాతీయ రహదారుల నిర్మాణ పనులకు కేంద్ర రహదారులు, రవాణాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాదే ఈ ప్రాజెక్టులు మంజూరైనప్పటికీ వాటి టెండరింగ్ ప్రక్రియను ఇదివరకు స్తంభింపజేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా ఏకకాలంలో అన్నింటినీ ప్రారంభించడానికి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఏపీ రహదారులు, భవనాల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. రాష్ట్రంలో మొత్తం 384 కిలోమీటర్ల పొడవైన రహదారుల నిర్మాణానికి మొదట రూ.6,646 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. కానీ ప్రస్తుతం ఆ వ్యయాన్ని రూ.6,280 కోట్లకు తగ్గించింది. ఇందులో కొండమోడు-పేరేచెర్ల సెక్షన్ విస్తరణ కూడా ఉంది.
- నేషనల్ హైవే నంబర్ 167 ఏజీలో 49.917 కిలో మీటర్ల మార్గాన్ని దాదాపు రూ. 881.61 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.
- జాతీయ రహదారి 167కెలో సంగమేశ్వరం-నల్లకాలువ, వెలిగొండ-నంద్యాల మధ్య 62.571 కోట్ల మార్గాన్ని 601 కోట్ల రూపాయలతో రెండు వరుసలుగా విస్తరిస్తారు.
- కొత్తగా జాతీయ రహదారిగా వెల్లడించిన ఎన్‌హెచ్ 167కెలో నంద్యాల-కర్నూలు, కడప బోర్డర్ సెక్షన్‌ను 62 కిలో మీటర్ల మేర ఆధునికీకరిస్తారు. దీనికోసం సుమారు రూ.691 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- జాతీయ రహదారి 440లో వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు (ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మీదుగా) ఉన్న 78.95 కిలోమీటర్ల రహదారిని 1321 కోట్ల రూపాయలతో రెండు, నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.
- నేషనల్ హైవే 716జిలోని ముద్దనూరు-హిందూపురం సెక్షన్‌లో 33.58 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 808 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.
- ఎన్‌హెచ్ 716జిలో ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి సెక్షన్ వరకు 56.5 కిలోమీటర్ల మార్గాన్ని 1,019.97 కోట్ల రూపాయలతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.
- ఎన్‌హెచ్ 516బిలో పెందుర్తి నుంచి ఎస్.కోట మార్గంలో ఉన్న 40.5 కిలోమీటర్ల రోడ్డును రూ. 956.21 కోట్లతో రెండు, నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు.
ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు టెండర్లు : ఏడు ప్రాజెక్టుల్లో మొదట రెండు ప్రాజెక్టులకు ఇప్పటికే టెండర్లను పిలవగా, ఇద్దరు ఎల్-1గా నిలిచారు. దీంతో ఆ రెండు సంస్థలు కోట్ చేసిన మొత్తానికే తాజా ధరలను నిర్ణయించి అంచనాలను సవరించారు. కొండమోడు-పేరేచెర్ల రహదారి విస్తరణలో భాగంగా మేడికొండూరు, సత్తెనపల్లి వద్ద రెండు బైపాస్ రోడ్లను నిర్మించనున్నట్లు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు ఓ ప్రకటనలో వెల్లడించారు.
రాజధానిని తాకుతూ హైవే విస్తరణ - 2 లైన్ల మార్గం 4 లైన్లుగా - NATIONAL HIGHWAY16 IN AMARAVATHI