BJP 5th Lok Sabha Candidates List : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్ఠానం విడుదల చేసింది. ఐదో విడతగా 111 మంది పేర్లను ప్రకటించింది. ఐదో జాబితాలో తాజాగా పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్, సీతా సోరెన్‌లతో పాటు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ, రామాయణ్ నటుడు అరుణ్ గోవిల్‌లకు చోటు దక్కింది. యూపీలోని పిలిభిత్‌లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీని తప్పించి, యూపీ మంత్రి జితిన్ ప్రసాదను ఆ సీటు నుంచి బరిలో దించింది. దీంతో ఇప్పటివరకు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 402కి చేరింది. ఇక సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు 14 మందిని ప్రకటించింది బీజేపీ.
17 రాష్ట్రాల్లో 111 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో 6, తెలంగాణలో రెండు స్థానాలకు, బిహార్‌లో 17, గోవాలో 1, గుజరాత్ 6, హరియాణా 4, హిమాచల్‌ప్రదేశ్ 2, ఝార్ఖండ్ 3, కర్ణాటక 4, కేరళ 4, మహారాష్ట్ర 3, మిజోరం 1, ఒడిశా 18, రాజస్థాన్ 7, సిక్కిం 1, ఉత్తర్‌ప్రదేశ్ 13, పశ్చిమబెంగాల్ 19 చొప్పున అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటివరకు నాలుగు జాబితాలుగా 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.
ఐదో లిస్ట్‌లో ప్రముఖులు వీరే :
- అరుణ్ గోవిల్ (మేరఠ్)
- నిత్యానంద్ రాయ్ (ఉజియార్‌పుర్)
- గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్)
- రవిశంకర్ ప్రసాద్ (పట్నా సాహిబ్)
- కంగనా రనౌత్ (మండి, హిమాచల్‌ప్రదేశ్)
- నవీన్ జిందాల్ (కురుక్షేత్ర)
- సీతా సోరెన్ (దుమ్కా )
- జగదీష్ షెట్టర్ (బెళగావి)
- కె సుధాకరన్ (చిక్కబళ్లాపుర్)
- ధర్మేంద్ర ప్రధాన్ (సంబల్‌పుర్, ఒడిశా)
- ప్రతాప్ సారంగి (బాలాసోర్)
- సంబిత్ పాత్ర ( పూరి, ఒడిశా)
- అపరిజిత సారంగి (భువనేశ్వర్, ఒడిశా)
- అభిజీత్ గంగోపాధ్యాయ (తామ్లుక్, బంగాల్)
ఇక ఐదో జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది పేర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించింది. ఇక తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటించింది.