Delhi Polls BJP Manifesto :దిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే మూడేళ్లలో యమునా నదిని శుద్ధి చేస్తామని కేంద్ర హోమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. దిల్లీలోని 1700 అనధికార కాలనీలలోని ప్రజలకు పూర్తి యాజమాన్య హక్కులను అందిస్తామని చెప్పారు. గిగ్ వర్కర్లకు, కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపడతామని అన్నారు. 'సంకల్ప పత్ర పార్ట్-3' పేరుతో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ చివరి మేనిఫెస్టోను అమిత్‌షా విడుదల చేశారు.
వరాల జల్లు
జాతీయ కామన్ మొబిలిటీ కార్డు కింద ఏడాదికి రూ.4వేల ఖర్చు వరకు దిల్లో మెట్రోలో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పిస్తామని అమిత్ షా అన్నారు. దిల్లీలో ఖాళీగా ఉన్న 50 వేల ప్రభుత్వ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామని, 20 లక్షల స్వయం ఉపాధి అవకాశాలను సృష్టిస్తామని చెప్పారు. గ్రాండ్ మహాభారత్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో యుమునా నదిని పూర్తిగా శుభ్రం చేయిస్తామని, గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 1,700 అనధికార కాలనీలలో కొనుగోలు, అమ్మకంతో పాటు నిర్మాణం ఇలా పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని అమిత్ షా తెలిపారు. రూ.10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తామని హామీ ఇచ్చారు.