Agnipath Scheme 2024 :సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన అగ్నిపథ్ పథకంలో మార్పులు చేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్నిపథ్ ప్రస్తుత నిబంధనల ప్రకారం అగ్నివీరులుగా సర్వీసులో ఉన్నవారిలో 75 శాతం మంది నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. 25 శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలురాగా, మిత్రపక్షాలు సైతం అగ్నిపథ్‌ను సమీక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో రెగ్యులర్ సర్వీసులోకి తీసుకునే అగ్నివీరుల సంఖ్యను పెంచే దిశగా అడుగులు పడుతున్నట్లు రక్షణశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. నాలుగు ఏళ్ల తర్వాత 50 శాతం మంది అగ్నివీరులను కొనసాగించాలని, వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని సైన్యం సిఫారసు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జీతభత్యాల్లోనూ మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
సైనిక బలం తగ్గే అవకాశం!
అంతర్గత సర్వేలు నిర్వహించిన సైన్యం అగ్నిపథ్ పథకంలో మార్పులకు సంబంధించి ఇప్పటికే పలు ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించింది. అగ్నివీరులుగా నియమించిన వారిలో కేవలం 25శాతం మందినే రెగ్యులర్ సర్వీసుల్లో కొనసాగిస్తే సైనిక బలం తగ్గే అవకాశం ఉందని, దాన్ని నివారించడానికి తిరిగి సర్వీస్‌లోకి తీసుకునే వారి సంఖ్య పెరగాలని నౌకదళ విశ్రాంత అధికారి ఒకరు తెలిపారు. ఎంతో శ్రమపడి శిక్షణ అందించిన సైనికుల పూర్తిస్థాయి సేవలను సైన్యం వినియోగించుకోవాలని వెల్లడించారు.