తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లక్షల మెజారిటీతో గెలిచినా నో టికెట్- 39మంది సిట్టింగ్​ ఎంపీలకు బీజేపీ షాక్ - BJP drops sitting MPs - BJP DROPS SITTING MPS

BJP Drops Sitting MPs : సార్వత్రిక ఎన్నికల్లో 370కిపైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. పూర్తిగా గెలుపు గుర్రాలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. లక్షల మెజారిటీతో గెలిచిన సిట్టింగ్​ ఎంపీలకు టికెట్ నిరాకరించింది అధిష్ఠానం.

BJP drops sitting MPs
BJP drops sitting MPs

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 8:21 AM IST

BJP Drops Sitting MPs : ఉత్తర భారత దేశంలో బలంగా కనిపిస్తున్నప్పటికీ సిట్టింగ్‌లను భారీ సంఖ్యలో మార్చింది బీజేపీ. 2019 లోక్​సభ ఎన్నికల్లో లక్షల మెజారిటీతో గెలిచిన అభ్యర్థులనూ వివిధ కారణాలతో పక్కనబెట్టింది. గత ఎన్నికల్లో లక్ష నుంచి 6 లక్షల వరకు మెజారిటీతో గెలుపొందిన 39 మంది అభ్యర్థులను మార్చింది. ఈ లోక్​ సభ ఎన్నికల్లో బీజేపీ పక్కన పెట్టిన అభ్యర్థుల్లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్‌, జౌళిశాఖ సహాయ మంత్రి దర్శనా జర్దోస్‌ ఉన్నారు. గత ఎన్నికల్లో భౌమిక్‌ను త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించగా ఆమె గెలిచారు. అయితే, ఆమెను ముఖ్యమంత్రిని చేస్తారని భావించినా చివరి నిమిషంలో ఆ పదవి దక్కలేదు. దీంతో ఆమె కేంద్రంలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, దిల్లీల్లో భారీ మెజారిటీలు దక్కాయి. ఇందులో ఒక్క మధ్యప్రదేశ్‌లో మినహాయించి మిగిలిన 4 రాష్ట్రాల్లో బీజేపీ 100 శాతం సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడూ అదే జోరును కొనసాగించేందుకు అభ్యర్థులను మార్చి పార్టీ కేడర్‌ను క్రియాశీలకంగా ఉంచే ప్రయత్నం చేసింది.

విమర్శలతో దక్కని స్థానం
ప్రజా జీవితంలో నిర్లక్ష్యంగా, అచేతనంగా ఉన్నవారిని, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మాటలు, చేతలతో పార్టీకి చెడ్డపేరు తెచ్చిన వారిని ఈ సారి పక్కనబెట్టింది. ప్రధానీ నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో 9 మంది సిట్టింగ్‌లను ఇంటికి పంపింది. ఇందులో ప్రధాని ప్రాతినిధ్యం వహించిన వడోదరా ఎంపీ రంజనాబెన్‌ భట్‌ ఉన్నారు. ఆమెకు పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో స్థానం కల్పించారు. ఆ తర్వాత రంజనాబెన్​పై ఆస్ట్రేలియాలో హోటళ్లు ఉన్నాయనే ఆరోపణలు చుట్టుముట్టడం వల్ల పక్కనబెట్టింది. దిల్లీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్‌ వర్మ కుమారుడు పర్వేష్‌ వర్మ, రమేష్‌ బిదూరి మైనారిటీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వారి అవకాశాలను దెబ్బతీసినట్లు చెబుతున్నారు. ఒక మతం చేసే వ్యాపారాలను బాయ్‌కాట్‌ చేయాలని ఒక బహిరంగ సభలో పర్వేష్‌ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీశాయి. అలాగే రమేష్‌ బిదూరి లోక్‌సభలో ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున యూపీ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ ఎంపీ డానిష్‌ అలీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సీటు కోల్పోయేలా చేశాయి. భోపాల్‌ ఎంపీ సాద్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకుర్‌ తొలగింపుకు కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే
రాజస్థాన్‌కు చెందిన దియా కుమారి, రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌, బాబా బాలక్‌నాథ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ప్రహ్లాద్‌ పటేల్‌, రాకేష్‌ సింగ్‌ గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడం వల్ల వారిని లోక్‌సభ బరి నుంచి తప్పించారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 370, ఎన్​డీఏ కూటమికి 400కిపైగా సీట్లు రావాలని లక్ష్యంగా పెట్టుకున్న నాయకత్వం అభ్యర్థుల ఎంపికలో కేవలం విజయావకాశాలకే ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీలో అంతర్గత కలహాలు, ఒకరిని ఒకరు దెబ్బ తీసుకునేందుకు ప్రయత్నించడం, అనవరమైన వ్యాఖ్యలు చేసి పార్టీని వివాదాల్లోకి లాగిన వారిని ఏమి ఆలోచించకుండా పక్కనబెడుతోంది. దీంతోపాటు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తోంది.

2019 ఎన్నికల్లో దేశంలో రెండో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన హరియాణాలోని కర్నాల్‌ ఎంపీ సంజయ్‌ భాటియాను పక్కనబెట్టి అక్కడ మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను రంగంలోకి దింపింది. గత ఎన్నికల్లో కర్ణాటకలోనే అత్యధికంగా 4.79 లక్షల మెజారిటీతో ఉత్తర కన్నడ లోక్​సభ స్థానం నుంచి 6 సార్లు గెలుపొందిన అనంత కుమార్ హెగ్డేను పక్కనబెట్టింది. తాము 400కిపైగా సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనను పక్కనబెట్టేలా చేశాయి.

'కేజ్రీవాల్ అంటే మోదీకి భయం'- సోషల్​మీడియా డీపీ మార్చుకోవాలని ఆప్ మంత్రి పిలుపు - AAP DP campaign For Kejriwal

కామెంట్స్ ఎఫెక్ట్- సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ నో ఛాన్స్- సీనియారిటీ ఉన్నా డోంట్​ కేర్​! - Loksabha Polls 2024

ABOUT THE AUTHOR

...view details