తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్ అసెంబ్లీ స్పీకర్​పై అవిశ్వాస తీర్మానం! సీఎం తొలి కేబినెట్ మీటింగ్ - బీహార్ స్పీకర్ అవిశ్వాస తీర్మానం

Bihar Speaker No Confidence Motion : బిహార్ అసెంబ్లీ స్పీకర్​పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఎన్​డీఏ. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్​ను తొలగించే ప్రక్రియ చేపట్టనున్నారు. మరోవైపు, సీఎం నీతీశ్ కుమార్ ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు.

Bihar Speaker No Confidence Motion
Bihar Speaker No Confidence Motion

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 10:45 AM IST

Bihar Speaker No Confidence Motion :బిహార్​లో కొలువుదీరిన ఎన్​డీఏ సర్కారు బలనిరూపణ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్​గా ఉన్న ఆర్​జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ యాదవ్ అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు. తీర్మానంపై నందకిశోర్​తో పాటు బిహార్ మాజీ సీఎం జీతన్​రామ్ మాంఝీ, మాజీ డిప్యూటీ సీఎం తారాకిశోర్ ప్రసాద్, జేడీయూ ఎమ్మెల్యే వినయ్ కుమార్ చౌదరి సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారు.

స్పీకర్ రాజీనామా చేయకపోతే, ఆయన్ను తొలగించే ప్రక్రియను అసెంబ్లీ చేపడుతుంది. ఓటింగ్ నిర్వహించి స్పీకర్ తొలగింపు ప్రక్రియపై సభ్యుల అభిప్రాయం కోరతారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఎన్​డీఏ కూటమిదే పైచేయిగా ఉంది. 243 స్థానాల అసెంబ్లీలో 128 సీట్లు ఎన్​డీయేకే ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్​జేడీల మహా కూటమికి 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. క్రాస్ ఓటింగ్ జరగకపోతే స్పీకర్ తొలగింపు ఖాయమే అని స్పష్టంగా తెలుస్తోంది.

స్పీకర్ తొలగింపు ఎందుకంటే?
ఆర్​జేడీ నుంచి గెలిచిన అవధ్ బిహారీ చౌదరి జేడీయూ-కాంగ్రెస్-ఆర్​జేడీ మహా కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత స్పీకర్​గా ఎన్నికయ్యారు. ఆయన్ను కొనసాగిస్తే ఎన్​డీఏ సర్కారుకు సభలో ఇబ్బందులు తప్పవు. జేడీయూలో చీలిక వస్తుందని ఆర్​జేడీ పదేపదే చెబుతూ వస్తోంది. అలా జరిగే పక్షంలో స్పీకర్ పోషించే పాత్ర కీలకం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్​డీఏ సర్కారు స్పీకర్​పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది.

తొలి కేబినెట్ మీటింగ్- అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే?
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నీతీశ్ కుమార్ తన తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ కార్యక్రమాల నిర్వహణపై కేబినెట్​లో నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నామని సీఎం నీతీశ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఫిబ్రవరి 29 వరకు సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. ఫిబ్రవరి 6న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

'ఇదీ మూన్నాళ్ల ముచ్చటే-ఎన్నికల వరకు కూడా కష్టమే!' బిహార్ పాలిటిక్స్​పై పీకే సంచలన వ్యాఖ్యలు

జేడీయూ చేరిక NDAకు లాభమేనా? 40 సీట్లు క్లీన్​స్వీప్​ చేస్తారా?

ABOUT THE AUTHOR

...view details