బిహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నీతీశ్ కుమార్ సర్కార్ విజయం సాధించింది. ప్రభుత్వానికి మద్దతుగా 129 మంది ఓటేశారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
బిహార్‌ను నేరాలు, అవినీతి రహిత రాష్ట్రంగా మార్చాలని సంకల్పించామని అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత విజయ్ సిన్హా తెలిపారు.
బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై విశ్వాసం కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు బిహార్ సీఎం నీతీశ్ కుమార్. అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత నీతీశ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
బిహార్ అసెంబ్లీ స్పీకర్, ఆర్జేడీ నేత అవథ్ బిహారీ చౌదరీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 125 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయడం వల్ల ఆయన స్పీకర్ పదవి నుంచి తొలిగించారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 112 మంది ఓటు వేశారు. దీంతో ఇప్పుడు జరిగే ప్రభుత్వ బలపరీక్షలోనూ ఇలానే జరగనుందని తెలుస్తోంది.
ఆర్జేడీ ఎమ్మెల్యేలు చేతన్ ఆనంద్, నీలం దేవి, ప్రహ్లాద్ యాదవ్ అసెంబ్లీలో ప్రభుత్వ పక్షాన కూర్చున్నారు. అయితే ఓటింగ్ ముగిసే వరకు ఎమ్మెల్యేలు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని, లేకుంటే ఓటు చెల్లుబాటు కాదని మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు.
బిహార్‌లోని ఇటీవలే ఏర్పడ్డ ఎన్డీఏ కూటమి బలపరీక్షలో ఉత్కంఠ కొనసాగుతోంది. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 122. బలపరీక్షలో తమ కూటమికి 127 ఓట్లు వస్తాయని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేసింది. కానీ అధికార కూటమికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. ఇప్పుడు దృష్టంతా హిందూస్థానీ అవామీ మోర్చా జితన్ రామ్ మాంఝీపైనే పడింది. ఆయన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార కూటమికి మద్దతు ప్రకటిస్తే నీతీశ్ సర్కార్ బలపరీక్షలో నెగ్గుతుంది.
బిహార్ స్పీకర్, ఆర్జేడీ అధినేత అవధ్ చౌధరీని తొలగించాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ యాదవ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
పట్నాలో బిహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ఆర్జేడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బిహార్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగించారు. రాష్ట్రంలో నీతీశ్ సర్కార్ ప్రధాన ప్రాధాన్యం చట్టబద్ధత అని తెలిపారు. శాంత్రిభద్రతలు మెరుగుపరచడానికి పోలీసుల సంఖ్య పెంచామని చెప్పారు.
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌తోపాటు డిప్యూటీలు సామ్రాట్ చౌధరీ, విజయ్ కుమార్ సిన్హా తదితరులు అసెంబ్లీకి చేరుకున్నారు.
Bihar Floor Test Live Update : బిహార్‌లో వరుసగా తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ మరికాసేపట్లో బల నిరూపణకు సిద్ధమయ్యారు. బలపరీక్షలో విజయం సాధించనున్నట్లు అధికార కూటమి విశ్వాసం వ్యక్తం చేసింది. సీఎం నీతీశ్ కుమార్ నాయకత్వంలో మెజారిటీ సాధిస్తామని, ప్రభుత్వం పదవీకాలం పూర్తి చేస్తుందని జేడీయూ జాతీయ కార్యదర్శి రాజీవ్ రంజన్ ప్రసాద్ తెలిపారు.
బలపరీక్షకు ముందు ఇటీవలే పట్నాలో జరిగిన జేడీయూ శాసనసభాపక్ష సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది. అనివార్య కారణాలతో సమావేశానికి రాలేకపోతున్నట్లు గైర్హాజరైన ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చినట్లు బిహార్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి విజయకుమార్ చౌధరీ తెలిపారు. సోమవారం జరిగే బలపరీక్షకు తమ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారని చెప్పారు. అంతకుముందు నీతీశ్ కుమార్ విప్ జారీ చేశారు.
243 స్థానాలు కలిగిన బిహార్ శాసనసభలో అధికార ఎన్డీఏ కూటమికి 128 మంది సభ్యుల బలం ఉందని జేడీయూ మంత్రి తెలిపారు. బలపరీక్ష నెగ్గిన తర్వాత స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తాను రాజీనామా చేయనని స్పష్టం చేశారు స్పీకర్ అవధీ చౌధరీ. దీంతో అధికార కూటమి బలపరీక్ష అనంతరం స్పీకర్ తొలగింపు ప్రక్రియ చేపట్టనుంది.
మరోవైపు విశ్వాస పరీక్షలో నీతీశ్‌ను ఓడించాలని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పావులు కదుపుతోంది. ఈ మేరకు జేడీయూ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆర్జేడీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఆదివారం పట్నా చేరుకున్న ఎమ్మెల్యేలను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నివాసానికి తరలించారు. ఈ క్రమంలో తేజస్వీ యాదవ్ నివాసం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఇటీవలే జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నీతీశ్‌తోపాటు బీజేపీ నాయకులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాను డిప్యూటీ ముఖ్యమంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ప్రమాణం చేయించారు. మరో ఎనిమిది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.