Bihar Floor Test 2024 :బలపరీక్ష నేపథ్యంలో బిహార్‌లో రాజకీయాలు ప్రతి గంటకూ మారుతున్నాయి. బలపరీక్షలో నెగ్గి ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించాలని నీతీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పట్టుదలతో ఉంది. ఇక విశ్వాస పరీక్షలో నీతీశ్‌ను ఓడించి, తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆర్జేడీ, కాంగ్రెస్ మహా కూటమి తన వ్యూహాలకు పదునుపెడుతోంది. బలపరీక్షలో నీతీశ్ ఓడిపోయేలా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో జేడీయూ ఎమ్మెల్యేలు పార్టీ నేత ఇచ్చిన విందుకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మంత్రి శ్రవణ్ కుమార్ విప్ జారీ చేసి మరీ జేడీయూ ఎమ్మెల్యేలను విందుకు ఆహ్వానించారు. కానీ ఆ విందుకు దాదాపు 10 మంది జేడీయూ నేతలు గైర్హాజరైనట్లు సమాచారం. ఇందులో బీమా భారతి, అనిరుధ్ యాదవ్, అశోక్ కుమార్ చౌదరి, దిలీప్ రాయ్, అమన్ హజారీ, గుంజేశ్వర్ షా, డాక్టర్ సంజీవ్, సుదర్శన్, షాలినీ మిశ్ర, గోపాల్ మండల్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే వీరికి ఆర్జేడీ వల వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే విషయాన్ని జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ 'ఈటీవీ భారత్'కు ప్రత్యేకంగా తెలిపారు. తేజస్వీ యాదవ్ తనకు ఫోన్ చేసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆఫర్ ఇచ్చారని గోపాల్ మండల్ తెలిపారు. కానీ తాను వారి ప్రతిపాదనను తిరస్కరించానని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ టికెట్‌పైనే పోటీ చేస్తానని, తనకు మంత్రి పదవిపై కూడా ఆసక్తి లేదని చెప్పారు. ఇక తాను విందుకు హాజరు కాలేకపోవడంపై మండల్ క్లారిటీ ఇచ్చారు. ట్రాఫిక్‌లో ఇరుక్కు పోయినందునే విందుకు రావడానికి ఆలస్యం అయిందని స్పష్టం చేశారు. అలాగే అనివార్య కారణాల వల్ల బీమా భారతి కూడా చేరుకోలేక పోయారని, ఆమె శనివారం సాయంత్రం పట్నా చేరుకుంటారని తెలిపారు. ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అనారోగ్యం కారణాల వల్ల విందుకు హాజరు కాలేకపోయారని గోపాల్ మండల్ వెల్లడించారు.
'మేమంతా ఐక్యంగా ఉన్నాం'
పార్టీ విందుకు కొంతమంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అవడంపై జేడీయూ నేతలు స్పందించారు. తామంతా ఐక్యంగా ఉన్నామని ఎమ్మెల్యే మనోజ్ యాదవ్ ప్రకటించారు. నీతీశ్ కుమార్‌కు అండగా నిలుస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ మెజారిటీని నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇక తమ పార్టీలో ఎలాంటి సమస్యలు లేవని మాజీ మంత్రి సంజయ్ ఝా అన్నారు.