Big Setback For BJP In UP :కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా మెుత్తం 80స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్ కీలకమైంది. 2014 నుంచి ఇక్కడ భారీ అధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఎన్డీఏ కంటే ఇండియా కూటమే ఇక్కడ అత్యధిక స్థానాల్లో సత్తా చాటగా బీజేపీకి అనూహ్యంగా షాక్ తగిలింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో అప్నాదళ్‌తో కలిసి పోటీ చేసిన బీజేపీ ఏకంగా 73 స్థానాలను సొంతం చేసుకుంది. 2019 ఎన్నికల్లో సమాజ్‌వాదీ, బీఎస్పీ జతకట్టగా ఎన్డీఏకు కాస్త తగ్గి 64 స్థానాలే వచ్చాయి. అయితే, గత రెండు ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఈ సారి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో జట్టుకట్టింది. సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో 62 స్థానాల్లో పోటీ చేయగా కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్‌కు కంచుకోటైన అమేఠి, రాయ్‌బరేలిలో ఈసారి హస్తం పార్టీ తన సత్తాను చూపింది. ఈ రెండు స్థానాలను నిలబెట్టుకుంది. బీజేపీ కంటే ఎక్కువ స్థానాలను సొంతం చేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి బిగ్ షాక్- అత్యధిక స్థానాల్లో SP దూకుడు - Big Setback For BJP In UP
Big Setback For BJP In UP : దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్. 2014లో 71, 2019లో 62 స్థానాలను బీజేపీ ఇక్కడ కైవసం చేసుకుంది. తద్వారా కేంద్రంలో కమలదళం అధికారంలోకి వచ్చేందుకు యూపీ దోహదపడింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కంచుకోటగా భావించే యూపీలో ఈసారి కమలదళానికి ఇండియా కూటమి కళ్లెం వేసింది. ఎన్డీఏ కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. ముస్లిం, బీసీ ఓట్లు కీలకంగా మారిన యూపీలో ఓటర్లు ఇండియా కూటమివైపు మెుగ్గు చూపడం విశేషం.
Published : Jun 4, 2024, 4:36 PM IST
ముస్లిం, బీసీల ఓట్లు దెబ్బకొట్టాయి
2022 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ 130 అసెంబ్లీ స్థానాలను కోల్పోయింది. ఇవి 26 లోక్‌సభ స్థానాలపై ప్రభావం చూపుతుందని ముందుగానే అంచనా వేశారు. అటు ముస్లిం ఓట్లు, బీసీల ఓట్లు ముఖ్యంగా యాదవ్‌ల ఓట్లు ఇండియా కూటమివైపు నిలిచాయి. అలాగే ఎస్పీ పోటీ చేసిన 62 స్థానాల్లో ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి చెందిన వారే ఐదుగురు ఉండటం కూడా ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి బాగా కలిసొచ్చింది. ప్రతి సభలోనూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముస్లిం-యాదవ వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రచారం చేయడం కూడా ఇండియా కూటమికి ఉత్తర్‌ప్రదేశ్‌లో సీట్లు పెరగడానికి కారణమయ్యాయి. బీఎస్పీకి చెందిన ఓట్లు కూడా పెద్ద ఎత్తున ఇండియా కూటమికి పడినట్లు తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో సీట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పాటించాయి. అవన్నీ కలిసొచ్చి బీజేపీకి కళ్లెం వేసేందుకు దోహదపడ్డాయి.
తగ్గిన మోదీ మెజారిటీ
ఇండియా కూటమి వల్ల వారణాసిలో పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా గట్టి పోటీ ఎదుర్కొన్నారు. ఒకదశలో మోదీ వెనకంజలోకి వెళ్లి ఆ తర్వాత పుంజుకున్నారు. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే వారణాసిలో మోదీ మెజార్టీ బాగా తగ్గింది.