Bharat Ratna Award Winner 2024 : దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రకటించింది. వారిలో మాజీ ప్రధానులు చౌధరీ చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీ, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు.
వీరిలో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు లభించింది. వారి కుటుంబ సభ్యులకు శనివారం ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకరరావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. మరో మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌధరీ, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యారావు, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ తరఫున ఆయన కుమారుడు రమేశ్‌నాథ్ ఠాకూర్ భారతరత్న పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అడ్వాణీ ఇంటికెళ్లి భారతరత్న ప్రదానం చేయనున్నారు.
పీవీ సేవలను ప్రతి భారతీయుడు గౌరవిస్తాడు : మోదీ
భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా మరణాంతరం అవార్డుల గ్రహీతలకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌధరీ చరణ్‌సింగ్‌తో పాటు ఇతరు ప్రముఖుల సేవలను కొనియాడారు. పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను ప్రతి భారతీయుడు గౌరవిస్తాడని, ఆయనకు భారతరత్న లభించినందుకు గర్వంగా భావిస్తారన్నారు. దేశ పురోగమనం, ఆధునీకరణ కోసం పీవీ ఎంతో కృషి చేశారన్న మోదీ, గొప్ప పండితుడిగా పేరు పొందారని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.
పీవీ నరసింహారావు
పీవీ నరసింహారావు 1921లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లాలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగానూ పనిచేశారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 మధ్య ప్రధానిగా పని చేశారు. ఈ సమయంలో 1992లో దేశంలో కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. రాజనీతిజ్ఞుడిగా, పండితుడిగా, బహుబాషావేత్తగా పేరుపొందారు.