Bengaluru Murder Case Suspect Dead : బెంగళూరు నగర శివార్లలో ఓ మహిళను 59 ముక్కలుగా నరికి, రిఫ్రిజిరేటర్లో కుక్కి పారిపోయిన నిందితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ముక్తి రంజన్ ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఆతడికి చెందినదిగా భావిస్తున్న డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అందులో, మహిళను చంపి 59 ముక్కలుగా నరికినట్లు అంగీకరించినట్లు చెప్పారు. చెట్టుకు వేలాడుతున్న నిందితుడు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ధునూరి పోలీస్ స్టేషన్ ఐఐసీ శాంతను జెనా తెలిపారు. కాగా కర్ణాటక పోలీసుల నుంచి తమకు సందేశం వచ్చిందని, కానీ ఆ రాష్ట్ర ప్రతినిధి ఇక్కడికి చేరుకోలేదని చెప్పారు.
ఇదీ కేసు
మహాలక్ష్మి(29) అనే మహిళ ఇటీవల బెంగళూరులో దారుణంగా హత్యకు గురైంది. ఈ కేసులో ముక్తిరంజన్ రాయ్(32) ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు తెలిపిన ప్రకారం, సెప్టెంబర్ మొదటివారంలో ఆమెను హత్య చేసిన నిందితుడు మృతదేహాన్ని ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచాడు. ఓ చిన్న విషయంలో ఆమెతో గొడవపడి కడతేర్చినట్లు ప్రాథమిక సమాచారం. ఇంట్లోనే చంపేశాక, ఓ దుకాణానికి వెళ్లి పెద్దకత్తి, సంచులు తెచ్చి ముక్కలుగా నరికినట్లు గుర్తించారు. హత్య అనంతరం రెండు రోజులు ఇంట్లోనే ఉండి, ఆధారాలు చెరిపి వేశాడని వయ్యాలికావల్ ఠాణా పోలీసులు గుర్తించారు. ఆమెను కడతేర్చిన విషయాన్ని హెబ్బగోడిలోని తన సమీప బంధువుకు చెప్పి వెళ్లిపోయాడు.