తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగ్లా సంక్షోభం​తో భారత్​కు పెను సవాళ్లు- ప్లాన్​ మార్చకపోతే మొదటికే మోసం! - Bangladesh Crisis - BANGLADESH CRISIS

Bangladesh Crisis Impact On India : బంగ్లాదేశ్‌ రాజకీయ సంక్షోభం భారత్‌కు తలనొప్పిగా మారింది. కొన్నేళ్లుగా షేక్‌ హసీనా ప్రభుత్వంతో కలిసి ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి కొనసాగిస్తున్న భారత్​కు కొత్త చిక్కులు వచ్చాయి. హసీనా ప్రభుత్వం కూలిపోవడం ఒక సమస్య అయితే తమకు వ్యతిరేకంగా పావులు కదిపే విపక్ష పార్టీలు గద్దెనెక్కితే అది చైనాకు వరంగా మారుతుందని ఆందోళన చెందుతోంది. ఇప్పటికే సరిహద్దు దేశాలతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటే అనుకూలంగా ఉన్న ఏకైక దేశంలోనూ ప్రభుత్వం కూలిపోవడం అనేక అంశాల్లో కొత్త సవాళ్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత్‌ విదేశాంగ విధానంలో కొత్త వ్యూహాలు రచించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

Bangladesh Crisis Impact On India
Bangladesh Crisis Impact On India (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 5:44 PM IST

Bangladesh Crisis Impact On India : బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం భారత్‌కు సవాలుగా మారింది. సుమారు 15 ఏళ్లుగా భారత్‌కు స్నేహహస్తం అందిస్తూ వచ్చిన హసీనా ప్రభుత్వం ఒక్కసారిగా కూలిపోయింది. విపక్ష బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ-BNP, జమాత్‌-ఇ-ఇస్లామీ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని సైన్యం ఏర్పాటుచేస్తే భారత్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని BNP మొదటి నుంచి భారత వ్యతిరేక స్వరం వినిపిస్తుండగా జమాత్‌-ఇ-ఇస్లామీ పాకిస్థాన్‌కు అనుకూలమైన పార్టీ. ఈ రెండు పార్టీలతో కూడిన ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో, ఏర్పడితే పొరుగు దేశం నుంచి ఎదురయ్యే సమస్యలు భారత్‌కు సవాళ్లుగా మారనున్నాయి.

డైలమాలో భారత్
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల కారణంగా బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌ వచ్చిన షేక్‌ హసీనాకు మోదీ సర్కారు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది. రాజకీయ శరణార్థిగా అవకాశం ఇవ్వాలని హసీనా లండన్‌ను కోరినప్పటికీ ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ హసీనా వినతిపై లండన్‌ సానుకూలంగా స్పందించకుంటే ఆమెకు ఆశ్రయం విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించాలనే అంశంపై భారత్‌ తర్జనభర్జన పడుతోంది. బంగ్లాదేశ్‌లో విపక్ష పార్టీల నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే హసీనాకు ఆశ్రయం కల్పించిన భారత్‌కు దాన్నుంచి చిక్కులు తప్పవనే వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో సుదీర్ఘ కాలంపాటు స్నేహహస్తం అందించిన హసీనాకు కష్టకాలంలో అండగా నిలవడం కూడా ముఖ్యమే. ఈ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వైఖరిపై భారత్‌ డైలమాలో పడింది.

కొత్త ప్రభుత్వం సహకరిస్తుందా
గత 15 ఏళ్లుగా భారత్‌కు అనూకుల ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో ఉండడం వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి ఢోకా లేకపోయింది. భారత్‌ వ్యతిరేక అతివాద బృందాలను హసీనా కట్టడి చేస్తూ వచ్చారు. దొంగనోట్లు, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల రవాణాను రెండు దేశాలు సమర్థంగా అడ్డుకుంటూ వచ్చాయి. బంగ్లాదేశ్‌తోపాటు భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సజావుగా జరుగుతూ వచ్చింది. 4వేల కిలోమీటర్లకుపైగా ఉన్న సరిహద్దు భద్రత కూడా సమర్థంగా నిర్వహించగలిగాయి. తాజాగా హసీనా ప్రభుత్వం కూలిపోవడం వల్ల బంగ్లాదేశ్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఆయా సమస్యల కట్టడికి ఏ మేరకు సహకరిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ కేంద్రంగా విదేశాలు పన్నే భారత్‌ వ్యతిరేక కుట్రలను అడ్డుకోవడం కూడా కేంద్ర ప్రభుత్వానికి సమస్యగా మారనుంది. మరో పొరుగు దేశమైన అఫ్ఘానిస్థాన్‌ నుంచి ఇప్పటికే భారత్‌కు ఇదే తరహా సవాలు ఎదురవుతూ ఉంది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత పాకిస్థాన్‌ కేంద్రంగా జరిగే ఉగ్ర కుట్రలను ఎదుర్కోవడం కొంత ఇబ్బందిగా తయారైంది. అయితే తాలిబన్‌ ప్రభుత్వం భారత్‌ ఆందోళనలను గుర్తించి పాక్‌ కేంద్రంగా జరుగుతున్న కుట్రలపై ఉప్పందిస్తోంది. బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాలతో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, రక్షణ సహకారం విషయంలో భారత్‌ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనేలా కనిపిస్తోంది.

బంగ్లాదేశ్‌లో విపక్షాల ప్రభుత్వం ఏర్పాటయితే చైనా మరోసారి అక్కడ క్రియాశీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హసీనా ప్రభుత్వం చైనాతో బలమైన ఆర్థిక సంబంధాలు ఏర్పరుచుకుంది. భారత్‌కు భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బంగ్లాదేశ్‌లో చైనా పెట్టుబడులకు హసీనా ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. ఇప్పటికే తీస్తా అభివృద్ధి ప్రాజెక్టుపై చైనా ఆసక్తితో ఉంది. అయితే ఆ ప్రాజెక్టును భారత్‌ చేపడుతుందని జనవరిలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా హసీనా ప్రకటించారు. త్వరలో సాంకేతిక బృందాన్ని బంగ్లాదేశ్‌ పంపేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హసీనా ప్రభుత్వం దిగిపోగా, కొత్త సర్కారు వచ్చాక చైనా తీస్తా అభివృద్ధి ప్రాజెక్టుపై వేగంగా పావులు కదిపే అవకాశం ఉంది. సరిహద్దుల్లో భారత్‌కు సమస్యలు సృష్టించే అవకాశాలూ లేకపోలేదు.

బంగ్లాదేశ్‌లో మారిన పరిస్థితుల కారణంగా అక్కడి మైనార్టీలపై దాడులు జరిగితే వారు భారత్‌కు వలస వచ్చే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగాల్​కు తరలివచ్చే అవకాశం ఉండగా వారిని ఆశ్రయం కల్పించడం కూడా భారత్‌కు సవాలుగా మారవచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు భద్రతా దళం పూర్తిగా అప్రమత్తమైంది. బంగ్లాదేశ్‌లో మారిన పరిస్థితులు భారత్‌కు ఓ విధంగా చేదువార్తగానే భావించాలి. కొన్నేళ్లుగా మన పొరుగుదేశాలైన శ్రీలంక, మయన్మార్, అఫ్గానిస్థాన్‌లో అనిశ్చితి పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్థాన్‌తో భారత్‌కు వైరం కొనసాగుతోంది. అఫ్ఘానిస్థాతాన్‌లో భారత్‌కు అనుకూలమైన ప్రభుత్వం కూలిపోయి, తాలిబన్లు అధికారం చేపట్టారు. మరోవైపు శ్రీలంకలోనూ చైనా ప్రాబల్యం పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల మాల్దీవులతోనూ భారత్‌కు విభేదాలు తలెత్తాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ తమకు వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడితే విదేశాంగ విధానం విషయంలో భారత్‌ సరికొత్త వ్యూహానికి పదును పెట్టాలనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లో పరిస్థితులను గమనిస్తున్నాం- హసీనా భారత్​కు రావడానికి అనుమతి కోరారు : కేంద్ర మంత్రి జైశంకర్‌ - Bangladesh Political Crisis

హసీనా విమానానికి రఫేల్‌తో బందోబస్తు - ఇండియా స్పెషల్ కేర్​! - Bangladesh Crisis

ABOUT THE AUTHOR

...view details