తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్థానికల అంశాలకే పెద్దపీట- ఉచితాలకూ జై- చిన్నపార్టీలతో దోస్తీ- BJP రూట్ ఛేంజ్​! - ASSEMBLY ELECTIONS BJP STRATEGY

వ్యూహాలు మార్చుకుంటున్న బీజేపీ- అసాధ్యం అనుకున్న రాష్ట్రాల్లోనూ అసాధారణ విజయాలతో దూకుడు!

Assembly Elections BJP Strategy
Assembly Elections BJP Strategy (Getty Images, ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 6:49 AM IST

Assembly Elections BJP Strategy :ఉత్తరాది పార్టీ అన్న అపవాదు జాతీయ అంశాలే ఎజెండా అనే ముద్రపడిన బీజేపీ తన వ్యూహాలను మార్చుకొంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలకు పెద్దపీట వేస్తోంది. మాదీ సంక్షేమ ఎజెండానే అంటూ ఉచిత హామీలకు జైకొడుతోంది. చిన్నపార్టీలనూ అక్కున చేర్చుకుంటూ అసాధ్యం అనుకున్న రాష్ట్రాల్లోనూ అసాధారణ విజయాలతో ముందుకెళుతోంది. మొన్న హరియాణా విజయం నేడు మహారాష్ట్ర ఘన విజయం వీటినే సూచిస్తున్నాయి.

అయోధ్య, ఉమ్మడి పౌరస్మృతి, ఆర్టికల్‌ 370 రద్దు- బీజేపీ హామీలేంటని అడిగితే ఒకప్పుడు ఎవరైనా ఠక్కున చెప్పేవి ఇవే. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించే వారిని, మెజారిటీ ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో అంతటి పవర్‌ఫుల్‌గా వ్యవహరించిన హామీలివి. ఇందులో రెండు హామీలు నెరవేరడంతో నెక్ట్స్‌ ఏంటి అన్న ప్రశ్న రాజకీయవర్గాలతోపాటు సగటు ఓటర్ల మదిలోనూ మెదిలింది. ఈక్రమంలోనే ఆ పార్టీ వ్యూహాలను మార్చుకుంది. స్థానిక అంశాలకు పెద్దపీట వేస్తూ ఆయా రాష్ట్రాల్లో విపక్ష పార్టీలకు కౌంటర్ స్ట్రాటజీ రూపొందించుకుంటూ ముందుకెళుతోంది.

రాష్ట్రాలవారీగా వ్యూహాలు రూపొందించుకోవడం వల్ల 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ విజయం సాధించింది. తీవ్ర వ్యతిరేకత కలిగిన కర్ణాటకలో ఓటమి చవిచూసింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీ నేత నాయబ్‌ సింగ్‌ సైనీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కమల దళం, జాటేతర ఓట్లను సాధించడంలో విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల సమయంలోమహారాష్ట్ర ఉల్లి రైతుల వ్యతిరేకతను గుర్తించి ఎన్నికలకు కొన్నినెలల ముందు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించింది.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉచితాలపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలో ఉచితాలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతింటాయని చెబుతూ వచ్చింది. అయితే పెరిగిన నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం కారణంగా మధ్య తరగతి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్ణాటకసహా పలురాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ గ్యారెంటీల పేరుతో సంక్షేమాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో మొన్నటి హరియాణా ఎన్నికల్లో లాడో లక్ష్మి యోజన కింద మహిళలకు నెలకు 2100 రూపాయలు ఇస్తామని, హక్‌ ఘర్‌ గృహిణి యోజన కింద 500కే గ్యాస్‌ సిలిండర్‌ను అందిస్తామంటూ బీజేపీ ఉచిత హామీలు ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల ముందు లడ్కీ బెహన్‌ యోజన పేరుతో కూటమి సర్కారు చేపట్టిన నగదు బదిలీ పథకం కూడా ఆ పట్ల మధ్య తరగతిలో సానుకూలత తెచ్చిపెట్టింది.

ABOUT THE AUTHOR

...view details