Assembly Elections 2024 :జమ్ముకశ్మీర్, హరియాణా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల నగారా మోగింది. జమ్ముకశ్మీర్‌లోని 90 శాసనసభ స్థానాలకు మూడు విడతల్లో, హరియాణాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించారు.
జమ్ముకశ్మీర్ ఎన్నికలు
జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 26 స్థానాలకు, మూడో విడతలో 40 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించనున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో మొత్తం 87 లక్షల ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. వారి కోసం 11 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 71లక్షల మంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు సీఈసీ చెప్పారు.
తొలిదశ
- నోటిఫికేషన్ విడుదల తేదీ : ఆగస్టు 20
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: ఆగస్టు 27
- నామినేషన్ల పరిశీలన: ఆగస్టు 28
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఆగస్టు 30
- పోలింగ్ తేదీ: సెప్టెంబర్ 18
రెండో దశ
- నోటిఫికేషన్ విడుదల తేదీ : ఆగస్టు 29
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: సెప్టెంబర్ 05
- నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 06
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: సెప్టెంబర్ 09
- పోలింగ్ తేదీ: సెప్టెంబర్ 25
మూడో దశ
- నోటిఫికేషన్ విడుదల తేదీ : సెప్టెంబర్ 05
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: సెప్టెంబర్ 12
- నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 13
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: సెప్టెంబర్ 17
- పోలింగ్ తేదీ: అక్టోబర్ 01
- ఎన్నికల ఫలితాల తేదీ: అక్టోబర్ 04
హరియాణా ఎన్నికలు
జమ్ముకశ్మీర్‌లో మూడో విడత పోలింగ్ రోజే హరియాణా శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 90 స్థానాలకు అక్టోబర్ ఒకటిన ఓటింగ్ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. వాటిలో 73 జనరల్ స్థానాలు కాగా 17 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రెండు కోట్లకుపైగా ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. 4.52 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
- నోటిఫికేషన్ విడుదల తేదీ : సెప్టెంబర్ 05
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: సెప్టెంబర్ 12
- నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 13
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: సెప్టెంబర్ 16
- అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: అక్టోబర్ 01
- ఎన్నికల ఫలితాల తేదీ: అక్టోబర్ 04
జమ్ముకశ్మీర్‌లో అలా- హరియాణాలో ఇలా!
జమ్ముకశ్మీర్‌లో 2014 నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 2018లో నుంచి బీజేపీ వైదొలిగింది. అనంతరం సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది. అనంతరం 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ కారణాల వల్ల జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరగలేదు. నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, బీజేపీ బరిలో దిగనున్నాయి. మరోవైపు, హరియాణాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మళ్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నాయి.