Ashok Chavan Quits Congress :లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు లేఖను పంపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోల్‌కు రాసిన లేఖలో అశోక్ చవాన్ పేర్కొన్నారు.
బీజేపీలో చేరుతారా?
ఈ నేపథ్యంలో అశోక్ చవాన్ బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. చవాన్‌కు రాజ్యసభ ఎంపీగా పార్లమెంట్‌లోకి పంపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై చవాన్ స్పందించారు. తన భవిష్యత్ కార్యాచరణపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. బీజేపీలో చేరే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. బీజేపీ పని విధానం తనకు తెలియదని అన్నారు.
అశోక్ చవాన్‌తోపాటు మరో 12మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. అశోక్ చవాన్ రాజీనామా గురించి విన్నానని, ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు. అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. అయితే, తాను ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేతోనూ మాట్లాడలేదని అశోక్ చవాన్ స్పష్టం చేశారు.
"మహారాష్ట్ర కాంగ్రెస్‌లో ఐక్యత లేదు. ఆ పార్టీలో అంతర్గత గొడవలు ఉన్నాయి. మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా రాజీనామా చేశారు. ఆ పార్టీకి నాయకుడు కూడా లేడు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తరచుగా ఓబీసీ వర్గానికి చెందిన ప్రధానిని దూషిస్తుంటారు. అందుకే ఆయనతో ఉండేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ప్రజలు కూడా ఆయనను వదలిపెడుతున్నారు. ఎవరైనా సరే బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం."
--చంద్రశేఖర్ బవాంకులే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు
అశోక్ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా 2008 డిసెంబర్ నుంచి 2010 నవంబర్ వరకు పనిచేశారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి శంకర్ రావ్ చవాన్ కుమారుడు. మరోవైపు ఇటీవల హస్తం పార్టీకి చెందిన సీనియర్ నేతలు బాబా సిద్దిక్, మిలింద్ దేవ్‌ర ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. తాజాగా అశోక్ చవాన్ రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.