తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా - Arvind Kejriwal Resignation

Arvind Kejriwal Resignation : దిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీమానా లేఖకు గవర్నర్ వీకే సక్సేనాకు అందించారు.

Arvind Kejriwal Resignation
Arvind Kejriwal Resignation (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 4:42 PM IST

Updated : Sep 17, 2024, 6:52 PM IST

Arvind Kejriwal Resignation :దిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను సమర్పించారు. అలాగే రాజ్ భవన్​కు కేజ్రీవాల్​తో పాటు ఆప్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిశీ, ఇతర మంత్రులు సైతం వెళ్లారు. కాగా, రెండు రోజుల క్రితమే సీఎం పోస్టుకు రాజీనామా చేస్తానని ప్రకటించిన కేజ్రీ, తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

'పార్టీకి, ప్రజలకు భావోద్వేగ క్షణం'
రవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారని ఆప్ శాసనసభాపక్ష నేత, కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన ఆతిశీ తెలిపారు. ఇది దిల్లీ ప్రజలకు, పార్టీకి భావోద్వేగ క్షణమని చెప్పుకొచ్చారు. అరవింద్ కేజ్రీవాల్‌ మళ్లీ సీఎం అయ్యేవరకు తాను దిల్లీని చూసుకుంటానని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కోరామని తెలిపారు. తాను దిల్లీ ప్రజల ప్రయోజనాలను రక్షిస్తానని పేర్కొన్నారు.

"కేజ్రీవాల్​పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కేజ్రీవాల్​ను టార్గెట్​గా పెట్టుకుంది. అందుకే కేజ్రీవాల్​కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను పంజరంలో చిలుకలుగా అభివర్ణించింది. కేజ్రీవాల్ కాకుండా వేరే నాయకులెవరైనా సీఎం సీటును వదులకోరు. కానీ కేజ్రీవాల్ తనపై వచ్చిన ఆరోపణలను ప్రజాకోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే రాజీనామా చేశారు. త్వరలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్​ను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. "
--అతిశీ, ఆప్ శాసనసభాపక్షనేత

'తప్పుడు కేసుల్లో కేజ్రీవాల్ జైలుకు'
అరవింద్ కేజ్రీవాల్​పై తప్పుడు అవినీతి ఆరోపణలు చేశారని ఆప్ నేత గోపాల్ రాయ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులో కేజ్రీవాల్​ను జైలులో ఉంచిందని ఆరోపించారు. 'సీఎంపై బీజేపీ నిత్యం బురదజల్లుతోంది. దీంతో ఆయన మనసు గాయపడింది. అందుకే జైలు నుంచి విడుదలవ్వగానే కీలక ప్రకటన చేశారు. తనను మళ్లీ దిల్లీ ప్రజలు సీఎంగా ఎన్నుకునేవరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆతిశీని ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని ఎల్​జీకి తెలియజేశాం. వీలైనంత త్వరగా కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవ తేదీని నిర్ణయించాలని అభ్యర్థించాం' అని ఆప్‌ నేత గోపాల్‌ రాయ్‌ తెలిపారు.

రెండు రోజుల క్రితమే ప్రకటన!
దిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్​కు సుప్రీం కోర్టు గత శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన ఆయన, మరో 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. న్యాయస్థానం నుంచి న్యాయం దక్కిందనీ, ప్రజల నుంచి న్యాయం జరగాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు తమను నిజాయతీ పరులుగా అంగీకరించేవరకు సీఎం సీటులో కూర్చోబోనని కేజ్రీవాల్‌ చెప్పారు. ఈ క్రమంలో మంగళవారం సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు.

ఆతిశీ వైపునకే మొగ్గు!
మరోవైపు, దిల్లీ కొత్త సీఎంగా ఆతిశీని నియమించారు అరవింద్ కేజ్రీవాల్. పార్టీ కీలక నేతలు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌, రాఘవ్‌ చద్దా, కైలోశ్‌ గహ్లోత్​తో పాటు కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ పేర్లు వినిపించాయి. ఆఖరికి ఆతిశీ వైపునకే మొగ్గు చూపారు కేజ్రీ. షీలా దీక్షిత్‌ తర్వాత దిల్లీలో మహిళా సీఎంగా ఆతిశీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించనున్నారు.

దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ఎంపిక - Delhi New CM Atishi

టీచర్​ నుంచి దిల్లీ సీఎంగా- ఆప్​ ఫైర్​బ్రాండ్​ ఆతిశీ మార్లీనా ప్రస్థానం ఇదే! - Who is Atishi Marlena

Last Updated : Sep 17, 2024, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details