Arvind Kejriwal ED Case :లిక్కర్ పాలసీ స్కాం కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించడానికి సమయం కోరింది ఈడీ. బుధవారం దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా, మూడు వారాల సమయం కోరింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ 'మాకు మంగళవారమే కేజ్రీవాల్ పిటిషన్ కాపీ అందింది. దాన్ని పరిశీలించి బదులిచ్చేందుకు మూడువారాల సమయం కావాలి' అని కోర్టును కోరారు. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ స్పందిస్తూ 'విచారణలో జాప్యం చేసే వ్యూహంతోనే పిటిషన్‌పై బదులిచ్చేందుకు ఈడీ మరింత సమయం అడుగుతోంది' అని ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి సరైన ప్రాతిపదిక ఏదీ లేదని దీనిపై హైకోర్టు చొరవచూపి తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
'మాకు మరింత సమయం కావాలి'- కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్‌పై ఈడీ - Arvind Kejriwal ED Case
Arvind Kejriwal ED Case : మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చేందుకు తమకు మరింత సమయం కావాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
Published : Mar 27, 2024, 11:35 AM IST
|Updated : Mar 27, 2024, 12:34 PM IST
మార్చి 23నే తాము హైకోర్టులో పిటిషన్ వేశామని, అప్పటి నుంచే పిటిషన్‌తో ముడిపడిన సమాచారం అందుబాటులోకి వచ్చినా, ఈడీ తరఫు న్యాయవాది అందలేదని చెప్పడం సరికాదని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అన్నారు. ‘‘ఈడీ రిమాండ్‌కు అప్పగించడాన్ని సీఎం కేజ్రీవాల్ సవాల్ చేస్తున్నారు. గురువారంతో కేజ్రీవాల్ రిమాండ్ గడువు ముగియబోతోంది. ఆలోగా హైకోర్టు తగిన నిర్ణయం ప్రకటించాలి’’ అని రిక్వెస్ట్ చేశారు. దీంతో కాసేపటి తర్వాత మళ్లీ విచారణ చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తెలిపారు.
రేపటితో ముగియనున్న కస్టడీ గడువు
వాస్తవానికి కేజ్రీవాల్ తన అరెస్టును సవాల్ చేస్తూ శనివారమే ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే ఆరోజున దీనిపై తక్షణ విచారణకు హైకోర్టు నో చెప్పింది. సోమ, మంగళవారాల్లో కోర్టు సెలవులు ఉన్నాయని, ఆ తర్వాతే (బుధవారం) పిటిషన్‌పై విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. అంతకుముందు మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ, మరుసటి రోజు దిల్లీలోని రౌస్ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. ఈడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయస్థానం సీఎంను ఈనెల 28(గురువారం) వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. శుక్రవారం మధ్యాహ్నం కేజ్రీవాల్‌ను ఈడీ మళ్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపర్చనుంది.