రూపాయి వేతనం పెంచకపోయినా సమ్మె విరమించిన అంగన్వాడీలు - నేటి నుంచి విధుల్లోకి Anganwadi Workers Called Off The Strike :ఏపీలో 42 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు అంగన్వాడీ సంఘాలు ప్రకటించాయి. మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జలతో రాత్రి పొద్దుపోయాక జరిపిన చర్చలు సఫలం కావటంతో సమ్మెను విరమిస్తున్నట్టు అంగన్వాడీ సంఘాల నేతలు ప్రకటించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సానుకూల అంశాలు వెలువడటంతో సమ్మెను కాల్ ఆఫ్ చేస్తున్నట్టు వెల్లడించారు. యథావిధిగా అంగన్వాడీలు అంతా విధులకు హాజరవుతామని ప్రకటించారు.
నెలకు ఒక టీఏ బిల్లు - సంక్షేమ పథకాలు వర్తింపు :వేతనాలను జూలైలో పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అంగన్వాడీ ప్రతినిధులు స్పష్టం చేశారు. జూలై నెలలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, చర్చల్లో జరిగిన అంశాలను రాతపూర్వకంగా ఇస్తామని చెప్పినట్టు వెల్లడించారు. గ్రాట్యుటీ అంశాన్ని కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని తెలిపారు. వర్కర్‌కు 1.2 లక్షలు ఇచ్చేందుకు, హెల్పర్‌కు 60 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు.
మట్టి ఖర్చులకు 20 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని స్పష్టం చేశారు. పరిహారంగా 2 లక్షలు ఇచ్చేందుకు కూడా అంగీకారం తెలిపారని అన్నారు. నెలకు ఒక టీఏ బిల్లును విడుదల చేయడంతో పాటు సంక్షేమ పథకాలూ వర్తింప చేస్తామని హామీ ఇచ్చింది. 42 రోజుల సమ్మె కాలానికి వేతనం ఇస్తామని, కేసులు కూడా ఎత్తివేయనున్నట్టు ప్రభుత్వం చెప్పిందని వివరించారు.
సీఎంతో చర్చించి ప్రకటిస్తాం :మరోవైపు అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలతతో ఉందని మంత్రి బొత్స తెలిపారు. 11 డిమాండ్లు అంగన్వాడీలు ప్రభుత్వం ముందు పెట్టారని అందులో 10 నెరవేర్చామన్నారు. వేతనం పెంపు జూలైలో ఉంటుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీలుగా తీర్చిదిద్దుతామని మంత్రివెల్లడించారు. అంగన్వాడీలు సమ్మె విరమించి ఇక విధులకు హాజరవుతారు. సమ్మె చేసిన కాలానికి ఏం చేయాలన్నదానిపై సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
ఏడు సార్లు అంగన్వాడీల ప్రతినిధులతో చర్చలు :అంగన్వాడీల ఆందోళనపై మొదటి నుంచి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బలవంతంగా కేంద్రాలను తెరిపించడం, నోటీసులు జారీ చేయడం, ఎస్మా ప్రయోగించడం వంటి చర్యలకు పాల్పడింది. చివరికి ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమైన కార్యకర్తలు తగ్గకపోగా. ఏపీ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకూ ఏడు సార్లు అంగన్వాడీల ప్రతినిధులతో చర్చలు జరిపిన ప్రభుత్వం వారి ప్రధాన డిమాండ్‌ను నెరవేర్చకుండానే నామమాత్రపు హామీతో వారి ఆందోళనకు పుల్‌స్టాప్ పెట్టింది.