తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొత్త చట్టాలపై ఎవరితోనైనా చర్చకు సిద్ధం- పూర్తిగా భారతీయ ఆత్మతో తీసుకువచ్చాం' - new criminal laws in india

Amit Shah On New Criminal Law : స్వాతంత్ర్యం సిద్ధించిన 77ఏళ్ల తర్వాత దేశంలో క్రిమినల్ న్యాయవ్యవస్థ పూర్తి స్వదేశీ నియమాలతో రూపొందిద్దుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చెప్పారు. శిక్ష విధించడం కన్నా న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టాలను రూపొందించామని తెలిపారు.

amit shah on new criminal law
amit shah on new criminal law (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 2:33 PM IST

Amit Shah On New Criminal Law :సత్వర న్యాయమే లక్ష్యంగా స్వదేశీ నేర న్యాయ చట్టాలను తెచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ చట్టాలపై నాలుగేళ్లకుపైగా చర్చ జరిగిందన్నారు. బ్రిటిష్‌ వాళ్లు తమ పాలన వ్యవస్థను కాపాడుకునేందుకు చట్టాలను తెచ్చారన్న ఆయన, 75ఏళ్ల తర్వాత భారతీయ ఆత్మతో కూడిన చట్టాలు అమల్లోకి వచ్చినట్లు వివరించారు. పాత చట్టాల్లో పోలీసుల హక్కులకు మాత్రమే రక్షణ ఉండేదన్న అమిత్ షా, ఇకపై బాధితులు, ఫిర్యాదుదారుల హక్కులకు రక్షణ ఉంటుందని చెప్పారు. కొత్త చట్టాలపై ఏ పార్టీ ప్రతినిధులతో అయినా సమావేశానికి తాను సిద్ధమన్నారు. పార్టీలకు అతీతంగా కొత్త నేర న్యాయ చట్టాలకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కొత్త చట్టాలతో నేర నిరూపణ రేటు 90శాతం వరకు ఉంటుందన్న కేంద్ర హోంమంత్రి నేరాల సంఖ్య తగ్గుతుందని జోస్యం చెప్పారు. పార్లమెంటు లైబ్రరీ హాల్‌ నుంచి నూతన న్యాయ చట్టాల అమలుపై ఆయన వివరణ ఇచ్చారు.

"మొట్టమొదట మన రాజ్యాంగ స్ఫూర్తితో చట్టంలో సెక్షన్లు, చాప్టర్లలో ప్రాధాన్యాలు ఇచ్చాం. తొలి ప్రాధాన్యం మహిళలు, చిన్నారులపై నేరాలకు ఇచ్చాం. ఇలాంటిది ఎప్పుడో ఇచ్చి ఉండాల్సిందనేది నా ఉద్దేశం. ఈ మేరకు ఒక అధ్యాయాన్ని పూర్తిగా చేర్చాం. 35 సెక్షన్లు, 13 అంశాలను జోడించాం. ఇకపై సామూహిక అత్యాచారానికి 20 ఏళ్ల జైలు లేదంటే జీవితఖైదు విధిస్తారు. మైనర్లపై అత్యాచారానికి మరణదండన విధిస్తారు. బాధితులకు సంబంధించిన వాంగ్మూలాన్ని మహిళా అధికారి, సొంత కుటుంబ సభ్యుల సమక్షంలో నమోదు చేస్తారు. ఆన్‌లైన్‌ ఎఫ్‌ఐఆర్ అవకాశం కల్పించాం. వీటి ద్వారా అనేక మంది మహిళలు ఇబ్బందికర పరిస్థితుల నుంచి రక్షణ పొందుతారని భావిస్తున్నాం."

--అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి

బాధితుల కేంద్రంగా కొత్త న్యాయ చట్టాలు
22.5 లక్షల పోలీసు అధికారులకు కొత్త చట్టాలపై శిక్షణ ఇచ్చేందుకు సుమారు 12,000 మందిని నియమించామని అమిత్​ షా తెలిపారు. "కొత్త న్యాయ చట్టాలపై విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. ఈ చట్టాలపై పార్లమెంట్‌లోని సభ్యులతో ఇప్పటికే చర్చించాం. సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం రూపొందించాం. లోక్‌సభలో 9.30 గంటలు, రాజ్యసభలో 6 గంటలు చర్చించాం. కొత్త చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుంది. కొత్త న్యాయ చట్టాలు బాధితుల కేంద్రంగా తయారయ్యాయి. వీటి వల్ల నేర విచారణ వేగంగా జరుగుతుంది. నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తవుతుంది." అని చెప్పారు.

దేశంలో తొలి కేసు ఇదే
మరోవైపు కొత్త చట్టాల కింద నమోదైన తొలి కేసుపైనా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టత ఇచ్చారు. నూతన చట్టాల ప్రకారం తొలి కేసు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మోటారు సైకిల్ దొంగతనం కింద నమోదైందని అమిత్ షా వివరించారు. దిల్లీలోని కమలానగర్​లో తోపుడు బండిపైన నమోదైన కేసు కాదని స్పష్టం చేశారు.

కొత్త చట్టాలపై కాంగ్రెస్​ ఫైర్​
మరోవైపు నూతన చట్టాల అమలుపై ప్రతిపక్ష కాంగ్రెస్​ విమర్శలు గుప్పించింది. 146మంది ఎంపీలను పార్లమెంట్​ నుంచి సస్పెండ్​ చేసి బలవంతంగా బిల్లులను ప్రభుత్వం ఆమోదింప చేయించిందని ఆరోపించింది. ఇలాంటి బుల్డోజర్​ న్యాయాన్ని ఇండియా కూటమి సహించబోదని కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. సుమారు 90 నుంచి 99 శాతం కొత్త చట్టాలు పాత వాటి నుంచి కాపీ పేస్ట్ చేశారని సీనియర్​ నేత చిదంబరం ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details