Champai Soren Letter : మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపయీ సోరెన్ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ నుంచి జేఎంఎం పేరును చంపయూ తాజాగా తొలగించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమే అనే అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. బీజేపీలో చేరిక విషయంపై స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ, సుదీర్ఘ లేఖను విడుదల చేశారు.
ఎన్నో అవమానాల వల్లే!
జేఎంఎం పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నందునే ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చిందని తెలిపారు. చంపాయీ సోరెన్. తన ముందు మూడు మార్గాలున్నాయని తెలిపారు. "పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ రోజు నుంచి జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోందని ఇటీవలి శాసనసభా పక్ష సమావేశంలో చెప్పాను. నా ముందు మూడు మార్గాలున్నాయి. ఒకటి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడం, రెండోది సొంతంగా పార్టీ పెట్టడం, చివరగా ఎవరైనా తోడుగా నిలిస్తే వారితో కలిసి పనిచేయడం. ఇప్పటినుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు నా ముందు ఈ మూడు మార్గాలున్నాయి" అని చంపయీ సోరెన్ పేర్కొన్నారు.
మరోవైపు ఆయన ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం దిల్లీ చేరుకున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై మీడియా ఆయనను ప్రశ్నించగా సొంత పని మీద దిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు. చంపాయీతో ఉన్న ఎమ్మెల్యేలను పార్టీ సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పలువురు బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన బంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చర్చలు జరిపిన్నట్లుగా సమాచారం.