Allahabad HC On Muslim Live In Relationship: ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తికి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. తన జీవిత భాగస్వామితో విడాకులు పొందకుండా వేరొక వ్యక్తితో కలిసి ఉండటం ముస్లిం వివాహ చట్టం ప్రకారం అనుమతించదని కోర్టు అభిప్రాయపడింది. సహజీవనం చేస్తున్న ఓ జంట, మహిళ కుటుంబ సభ్యుల నుంచి భద్రత కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇదీ కేసు
2020లో షాదాబ్ అనే వ్యక్తి ఫరీదా ఖాతూన్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం ఫరీదా తన తల్లిదండ్రుల దగ్గర జీవిస్తోంది. ఈ క్రమంలో షాదాబ్ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే తన సోదరిని కిడ్నాప్ చేశాడంటూ షాదాబ్పై సదరు మహిళ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఫిర్యాదును షాదాబ్ అలహాబాద్ హై కోర్టులో సవాల్ చేశాడు. తాము ఇష్టప్రకారమే కలిసి జీవిస్తున్నామని, తనపై కిడ్నాప్ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటషన్ దాఖలు చేశాడు. అలాగే మహిళ కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. వారు తమ రిలేషన్షిప్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.
దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు, ఆర్టికల్ 21 ప్రకారం ఈ కేసులో ఎటువంటి రక్షణను కల్పించలేమని తెలిపింది. ముస్లిం చట్టం ప్రకారం జీవిత భాగస్వామి ఉండగా వేరే వ్యక్తితో సహజీవనం చేయడానికి అనుమతి ఉండదని పేర్కొంది. అందుకే రక్షణ కల్పించలేమని చెప్పింది.