ADR Report On delhi Assembly Elections :ఈసారి దిల్లీ అసెంబ్లీ పోల్స్‌లో ఎన్నికైన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దిల్లీ ఎమ్మెల్యేలలో నేరచరితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం సానుకూల పరిణామం. 2020లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అయిన వారిలో అత్యధికంగా 43 మంది నేరచరితులే ఉండటం గమనార్హం. ఈ మేరకు వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ నివేదికను విడుదల చేసింది.
ఇటీవలే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 699 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను ఏడీఆర్ రూపొందించింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్న వారిలో తీవ్ర నేరాలకు పాల్పడినవారు కూడా ఉండటాన్ని ఆందోళనకర అంశంగా ఏడీఆర్ పేర్కొంది. దిల్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 17 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయని తెలిపింది. వీరిలో పలువురిపై హత్యాయత్నం, మహిళలపై నేరాలతో ముడిపడిన అభియోగాలు నమోదైనట్లు వెల్లడించింది. ఈసారి ఎన్నికైన ఒక ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసులు, మరో ఇద్దరిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలోని సమాచారంతో వెల్లడైంది.
2020లో జరిగిన దిల్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అయిన 37 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నట్లు ఏడీఆర్ గుర్తుచేసింది. ప్రస్తుతం పార్టీలవారీగా చూస్తే బీజేపీ తరఫున గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో 16 మందిపై, ఆప్‌నకు చెందిన 22 మంది ఎమ్మెల్యేల్లో 15 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆప్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.
70 మంది ఎమ్మెల్యేలకు రూ.1,542 కోట్ల ఆస్తులు
దిల్లీ పోల్స్‌లో కొత్తగా ఎన్నికైన 70 మంది ఎమ్మెల్యేలకు మొత్తం రూ.1,542 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఈ లెక్కన ప్రస్తుతం దిల్లీలోని ఒక్కో ఎమ్మెల్యేకు సగటున రూ.22.04 కోట్ల ఆస్తి ఉంది. 2020లో దిల్లీలో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి విలువ కేవలం రూ.14.29 కోట్లే. అంటే ఈసారి ఎన్నికల్లో మరింత సంపన్నులే పోటీ చేశారు. ఆస్తులపరంగా బీజేపీ ఎమ్మెల్యేలే టాప్‌లో ఉన్నారు. ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.28.59 కోట్లుగా ఉంది. ఆప్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.7.74 కోట్లే. రూ.115 కోట్ల నుంచి రూ.259 కోట్ల రేంజులో ఆస్తిపాస్తులను కలిగిన ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలిచారు. ఇక ఇదే సమయంలో ఆప్ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల ఆస్తి విలువ రూ.20 లక్షలలోపే ఉంది.
అప్పుల్లో నంబర్ 1 పర్వేశ్ వర్మ
ఈసారి దిల్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 44 శాతం మందికి రూ.10 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి. కేవలం 3 శాతం మందికే రూ.20 లక్షలలోగా ఆస్తిపాస్తులు ఉన్నాయి. 23 మంది ఎమ్మెల్యేలు తమకు రూ.1 కోటికిపైగా అప్పులు ఉన్నాయని ప్రకటించారు. అప్పుల విషయంలో అరవింద్ కేజ్రీవాల్‌పై గెలిచిన బీజేపీ నేత పర్వేశ్ వర్మ నంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఈయనకు ఏకంగా రూ.74 కోట్ల అప్పులు ఉన్నాయట. అత్యంత సంపన్న బీజేపీ ఎమ్మెల్యేల్లో కర్నైల్ సింగ్ (రూ.259.67 కోట్లు), మంజీందర్ సింగ్ సిర్సా (రూ.248.85 కోట్లు), పర్వేశ్ వర్మ (రూ.115.63 కోట్లు) ఉన్నారు.
విద్యార్హతలు, వయస్సు
దిల్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో 64 శాతం మంది డిగ్రీ అంతకంటే ఎక్కువ విద్యార్హతలను కలిగి ఉన్నారు. ఐదోతరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నామని 33 శాతం మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లలో ప్రకటించారు. కొత్త ఎమ్మెల్యేల్లో 67 శాతం మంది 41 నుంచి 60 ఏళ్లలోపువారు, 20 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. 2020 ఎన్నికల్లో 8 మంది మహిళలు దిల్లీ అసెంబ్లీకి ఎన్నికవగా, ఈసారి ఐదుగురు వనితలే ఎన్నికయ్యారు. వివిధ పార్టీలకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వరుసగా మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరి సగటు ఆస్తులు 2020 ఎన్నికల నాటితో పోలిస్తే 25 శాతం మేర పెరిగి రూ.7.04 కోట్ల నుంచి రూ.8.83 కోట్లకు పెరిగాయి.
ఆప్ నుంచి ఆమె ఒక్కరే
బీజేపీ తరఫున ప్రస్తుతం నలుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆప్ నుంచి అతిశీ ఒక్కరే మహిళా ఎమ్మెల్యే. 2020లో ఆప్ నుంచి అత్యధికంగా 8 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు. కొత్త ఎమ్మెల్యేలలో 61 శాతం మంది తమ ప్రొఫెషన్ రాజకీయాలు లేదా సామాజిక సేవ అని వెల్లడించారు. 2020 ఎన్నికల్లో 67 శాతం మంది ఈ విధమైన సమాచారమిచ్చారు. బిజినెస్‌ను ప్రొఫెషన్‌గా వెల్లడించిన ఎమ్మెల్యేల సంఖ్య 29 శాతం నుంచి 49 శాతానికి పెరిగింది. దిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల సగటు వయసు 52 ఏళ్లు. ఈ వివరాలను పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ నివేదికలో ప్రస్తావించారు.