Acid Attack On College Students : ముగ్గురు కాలేజీ విద్యార్థినులపై యాసిడ్ చేశాడు ఓ యువకుడు. తీవ్రంగా గాయపడిన బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కర్నాటకలోని కడబ ప్రభుత్వ కళాశాలలో జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, ఆ ముగ్గురు విద్యార్థులు ద్వితీయ పీయూసీ( ఇంటర్) చదువుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో పీయూసీ పరీక్షలు జరుగుతున్నాయి. కడబ ప్రభుత్వ కళాశాలలో పరీక్షను రాసేందుకు విద్యార్థలు వచ్చారు. కళాశాల ఆవరణలో కూర్చొని విద్యార్థినులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఎంబీఏ చదువుతున్న అబిన్(23) విద్యార్థిలాగా మాస్క్, టోపీ ధరించి కాలేజీ వచ్చాడు. పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థినిపై ఒక్కసారిగా యాసిడ్తో దాడి చేశాడు. దీంతో ఆ అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పక్కనే కూర్చున మరో ఇద్దరి మీద కూడా యాసిడ్ పడి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను వెంటనే కడబ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
కారణం అదే!
ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. దాడి అనంతరం తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించగా స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ప్రేమ విఫలమవడం కారణంగానే నిందితుడు ఈ చర్యకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.