తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రిపబ్లిక్‌డే పరేడ్​లో 'ఉమెన్'​ పవర్​- చరిత్రలో తొలిసారి 100మంది అలా- 148మంది ఇలా! - REPUBLIC DAY PARADE WOMEN

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన కవాతులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నారీశక్తి

Republic Day Parade Women
Republic Day Parade Women (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2025, 2:22 PM IST

Republic Day Parade Women Contingent : దిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర దినోత్సవ కవాతు ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో వికసిత్‌ భారత్‌, నారీ శక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశ చరిత్రలో తొలిసారిగా 100మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్యపథ్‌లో పరేడ్‌ను ప్రారంభించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ మహిళా అధికారులు లెఫ్టినెంట్ కర్నల్‌ రవీందర్‌జీత్ రంధావా, లెఫ్టినెంట్ కమాండర్ మణి అగర్వాల్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రుచి సాహా, కెప్టెన్ సంధ్యా మహ్లా దీనిలో పాల్గొన్నారు.

15మంది మహిళా పైలట్ల బృందం ఫ్లై-పాస్ట్‌
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO నిర్వహించిన కవాతుకు మహిళా శాస్త్రవేత్త సునీతా జెనా నాయకత్వం వహించారు. అధునాతన రక్షణ సాంకేతికతల ద్వారా దేశ భద్రతను బలోపేతం చేయడంలో అతివలు అందించిన కీలకమైన సహకారాన్ని అందులో ప్రదర్శించారు. అసిస్టెంట్ కమాండెంట్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 148 మంది సభ్యుల మహిళా బృందం, డివిజనల్ సెక్యూరిటి కమిషనర్ ఆదిత్య నేతృత్వంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం పరేడ్‌లో పాల్గొన్నాయి. సుమారు 15మంది మహిళా పైలట్ల బృందం ఫ్లై-పాస్ట్‌లో తమ ప్రతిభను చూపారు.

కవాతులో 16 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు సందడి చేశాయి. వీటిలో మహిళా సాధికారత అంశాన్ని ప్రతిబింబించేవి 26 ఉన్నాయి. మణిపుర్‌లో తామర పూల కాడలలోని సున్నితమైన నారలతో చీరలు తయారు చేసే మహిళలు, పడవలు నడుపుతున్న స్త్రీలు, హస్తకళలు, చేనేత సహా వివిధ రంగాల్లో ప్రఖ్యాతి పొందిన వారికి సంబంధించిన విషయాలను ప్రదర్శించారు.

  • ఇండోనేసియాకు చెందిన నేషనల్‌ ఆర్మ్‌డు ఫోర్సెస్‌ నుంచి 152 మంది బృందం కవాతులో పాల్గొంది. మరో 190 మంది సభ్యుల బ్యాండ్‌ బృందం మార్చ్ నిర్వహించింది.
  • లెఫ్టినెంట్‌ అహాన్‌ కుమార్ నేతృత్వంలోని 61 మంది అశ్విక దళం కవాతు నిర్వహించింది. అనంతరం ట్యాంక్‌ T-90 (భీష్మ), BMP-2 శరత్‌తో పాటు నాగ్‌, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు, పినాక, అగ్నిబాణ్‌ మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్లు, ఆకాశ్‌ వెపన్ సిస్టమ్‌, చేతక్‌, బజరంగ్‌, ఐరావత్‌తో సహా పలు ఆయుధాలను ప్రదర్శించారు.
  • ఈ వేడుకల్లో త్రివిధ దళాలు సంయుక్తంగా ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘సశక్త్‌ ఔర్‌ సురక్షిత్ భారత్‌’ అనే థీమ్‌తో దీన్ని తయారు చేశారు.
  • వివిధ ప్రాంతాల నుంచి ఐదు వేల మంది కళాకారులు ‘జయతి జయ మహాభారతం’ పాటకు 11 నిమిషాల పాటు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.
  • మోటారు సైకిళ్లపై డేర్‌డెవిల్స్ చేసిన విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. బుల్లెట్ సెల్యూట్, ట్యాంక్‌ టాప్‌, డబుల్‌ జిమ్మీ, డెవిల్స్ డౌన్‌ వంటి అంశాలను ప్రదర్శించారు.
  • 22 ఫైటర్ జెట్‌లు , 11 ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఏడు హెలికాప్టర్‌లు వైమానిక ప్రదర్శన వీక్షకులను కట్టిపడేసింది. వీటిలో రఫెల్‌, సు-30, జాగ్వార్‌, సి-130,సి-295, సి-17, డోర్నియర్‌-228, ఏఎన్‌-31 విమానాలతో పాటు ఎమ్‌ఐ-17 హెలికాప్టర్లు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details