తెలంగాణ

telangana

ETV Bharat / bharat

75వసంతాల భారత రాజ్యాంగం - సామాన్యుల రక్షణ గోడ - అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దిక్సూచి - 75TH CONSTITUTION DAY OF INDIA

నేడు 75వ రాజ్యాంగ దినోత్సవం - స్వేచ్ఛ, సమానత్వానికి ఊపిరిలూదిన భారత రాజ్యాంగం గురించి ముఖ్యమైన విషయాలు ఇవే

75th Constitution Day Of India
75th Constitution Day Of India (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2024, 8:57 AM IST

Updated : Nov 26, 2024, 9:06 AM IST

75th Constitution Day Of India : భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమూహారం కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలు మూల స్తంభాలుగా- అన్ని విధాలా ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయం. 75సంవత్సరాలుగా సామాజిక, ఆర్థిక, లింగ భేదాలకు అతీతంగా- దేశ ప్రజల జీవితాల్నీ ప్రభావితం చేస్తూనే ఉంది. పేద, ధనిక అని తేడా లేకుండా ఓటు హక్కు, భావప్రకటన స్వేచ్ఛ, ఇష్టం వచ్చిన ధర్మాన్ని పాటిస్తున్నారన్నా అని రాజ్యాంగ చలవే. అలాంటి భారత రాజ్యాంగం గురించి మరి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

అందరూ రాజ్యాంగ గూటి కిందకే!
ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం- రాజ్యాంగం ద్వారా సంక్రమించినవే. సమాజంలోని ప్రతివ్యక్తి - నిరక్షరాస్యుడు, విద్యాధికుడు, కూటికి లేని నిరుపేద, ధనవంతులు కానీ ప్రతి ఒక్కరు రాజ్యాంగం పరిధిలో మనుగడ సాగిస్తున్నవారే.

అధికారం మాత్రమే కాదు జవాబుదారీతనం కూడా
భారత రాజ్యాంగం పాలకులకు అధికారాలు ఇవ్వడమే కాకుండా, దానికి జవాబుదారీ తన్నాన్నీ జతచేసింది. ప్రజల గురించి అధికారిక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు, అధికారులు, పాలకులు- ప్రజాభిప్రాయానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్దేశిస్తోంది.

అలా తలదూర్చకూడదు!
ప్రజలకు సేవలందించడానికి శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్ని నెలకొల్పింది భారత రాజ్యాంగం. ఆ 3 వ్యవస్థలనూ పరస్పర సమన్వయంతో పనిచేసే ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రతి వ్యవస్థకూ హద్దుల్ని నిర్ణయించింది. శాసన నిర్మాణ వ్యవస్థ ప్రజల కోసం చట్టాలు చేస్తే- వాటిని కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేస్తుంది. ఇక ఈ చట్టాల అమలును న్యాయ వ్యవస్థ సమీక్షిస్తుంది. అయితే ఒక వ్యవస్థ పనిలో మరొక వ్యవస్థ తలదూర్చకుండా నిబంధనలు ఉన్నాయి.

భారత రాజ్యాంగానికి ఆత్మ అదే
భారత రాజ్యాంగ పరిషత్‌ సభ్యులందరూ స్వాతంత్య్ర సమరయోధులే. వారు ఏ హక్కుల కోసం అయితే బ్రిటిష్‌ పాలకులతో పోరాటం చేశారో- ఆ హక్కుల్ని రాజ్యాంగంలో భారత పౌరులందరికీ అందజేశారు. రాజ్యాంగ నిర్మాతలు సూత్రీకరించిన ప్రాథమిక హక్కులు- తరతరాల భారత పౌరులకు అందించిన గొప్ప వరం అనే చెప్పాలి. 'ససవే మానుసే పజా మమ'(నా రాజ్యంలోని మనుషులందరూ నా బిడ్డలు) అంటూ వివక్షతా రాహిత్యం అశోక చక్రవర్తి తన శిలాశాసనాల్లో పేర్కొన్నారు. అది 12వ అధికరణం నుంచి 35వ అధికరణం వరకూ విస్తరించి ఉన్న ప్రాథమిక హక్కుల్లో తొణికిసలాడుతుంది. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగానికి పునాది. ఇందులో 32వ అధికరణం ఎంతో ప్రధానమైంది. అది లేకపోతే రాజ్యాంగానికి విలువే లేదని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు. ఈ ఆర్టికల్ భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని ఆయన అన్నారు.

అంటరానితనంపై అంకుశం
అద్భుత చరిత్ర ఉందని చెప్పుకొనే భారతావనిని వెంటాడిన అవలక్షణం అంటరానితనం! దీనిపై అంకుశమెత్తింది మన రాజ్యాంగం. 23వ అధికరణం అంటరానితనాన్ని నిషేధించింది.

సోషల్ ఇంజినీరింగ్‌
కేవలం అంటరానితనాన్ని నిషేధించం మాత్రమే కాకుండా- రిజర్వేషన్ల రూపంలో సరికొత్త సమాజిక ఇంజినీరింగ్‌కు మన రాజ్యాంగం అవకాశం కల్పించింది. తరతరాల వెలివేతను అనుభవించిన బలహీన వర్గాల 0వారికి రిజర్వేషన్ల రూపంలో అండగా నిలిచింది.

స్వేచ్ఛకు అండగా
భారత రాజ్యాంగంలోని అర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. కుల, మత, జాతి, లింగ, జన్మస్థల ప్రాతిపదికన వివక్షకు పాల్పడటాన్ని ఇది నిషేధించింది. ఉపాధి విషయంలోనూ అందరికీ సమాన అవకాశాలు పొందే ప్రాథమిక హక్కును మన రాజ్యాంగం ప్రతి పౌరునికీ అందించింది. ఇక 19వ అధికరణం ఆరు వ్యక్తిగత స్వేచ్ఛలకు పూచీగా నిలుస్తోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ, ఒక సమూహంగా ఏర్పడి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ వంటివి ఈ ఆర్టికల్ అందిస్తుంది.

దేశ పౌరులు తమ ఆత్మప్రబోధానుసారం తమకు ఇష్టమైన మతాన్ని ఆచరించే హక్కును రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్ కల్పిస్తోంది. మతాన్ని ఆచరించే, పెంపొందించుకునే స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగం- ప్రభుత్వ విద్యాలయాల్లో, ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న విద్యాలయాల్లో మతబోధ చేయడాన్ని నిషేధించింది. అలాగే అల్పసంఖ్యాక వర్గాలు తమ భాష లిపి, సంస్కృతులను పరిరక్షించుకునేందుకు(మైనారిటీ) సంస్థలు స్థాపించుకోవడానికి 30వ అధికరణం అనుమతి ఇస్తోంది.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ
భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రధానమైనది. ఈ హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటిది. సమాజంలో స్వేచ్ఛా సమానత్వాలు పరిఢవిల్లడానికి అనివార్యమైనది ఈ అధికరణ. వ్యక్తులు తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి, తమ భావాలను సాటి మనుషులతో పంచుకోడానికి, విజ్ఞానం పొందడానికి, పంచడానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది. అయితే ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ- సమాజ భద్రత, జాతీయ భద్రత, నైతికత అనే హద్దులకు లోబడి ఉంటుంది. ఈ మేరకు రాజ్యాంగం సూచించింది. ఈ హక్కును అనుభవించాలంటే కొన్ని బాధ్యతలూ నిర్వర్తించక తప్పదని డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్‌ భావించేవారు.

అందరికీ ఓటు
అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు తమవి నాగరిక దేశాలని తమకు తామే కితాబులిచ్చుకున్నాయి. కానీ వివక్షల్లేకుండా పౌరులకు ఓటు హక్కు కల్పించలేదు. అందుకున్న భిన్నంగా భారత రాజ్యాంగం మాత్రం స్వాతంత్య్రం పొందిన వెంటనే కులం, మతం, లింగభేదం- చదువు, ధనిక, పేద ఇలాంటి వివక్ష లేకుండా వయోజనులందరికీ సార్వజనీన ఓటు హక్కు అందించింది.

Last Updated : Nov 26, 2024, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details