1100 KG Drum To Ayodhya Ram Mandir :ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడికి ఇంకా కానుకలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 2500 కిలోల భారీ గంట, 400 కిలోల తాళం, 108 అడుగుల బాహుబలి అగరుబత్తి సహా ఎన్నో రకాల కానుకలను అందించిన రామ భక్తులు తాజాగా మరో భారీ కానుకను రామయ్యకు సమర్పించారు. 1100 కిలోల బరువున్న భారీ సంగీత వాయిద్యం- తబలాను అయోధ్య రాముడి కోసం తీసుకువచ్చింది మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్ జన్ కళ్యాణ్ సమితి బృందం. బుధవారం దీనిని రామసేవక్ పురంలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది.
గిన్నిస్‌లో తబలా
మధ్యప్రదేశ్‌లోని రీన్వా జిల్లా నుంచి ప్రత్యేక వాహనంలో ఈ భారీ తబలాను బుధవారం అయోధ్యకు తీసుకువచ్చారు. ఇక్కడకు చేరుకున్నాక ఓ భారీ క్రేన్ సాయంతో డప్పుల నడుమ రామనామస్మరణ చేసుకుంటూ నృత్యాలతో తబలాను అయోధ్యకు చేర్చారు భక్తులు. అయితే ఈ తబలాను ప్రపంచంలోనే అతిపెద్ద డ్రమ్ముగా అభివర్ణిస్తున్నారు దీని తయారీదారులు. అంతేగాక దీనికి ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కూడా దక్కిందని చెబుతున్నారు.
తబలా తయారీలో ముస్లింలు
టన్నుకు పైగా బరువున్న ఈ తబలా ఎత్తు 6 అడుగులు, వెడల్పు 33 అడుగులు. దీనిని తయారు చేయడానికి 3 నెలల సమయం పట్టిందని నిర్వాహకులు తెలిపారు. అలీగఢ్, కాన్పుర్, ప్రయాగ్‌రాజ్, మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలకు చెందిన కళాకారులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం కళాకారులు కూడా ఈ తబలా తయారీలో పాల్గొన్నారని చెప్పారు. ఇది గంగా-యమున సంస్కృతికి ప్రతీక అని అన్నారు. ఈ తబలా వాయించినప్పుడు దీని శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుందని తెలిపారు.