110 Voters In One Family In Bihar : లోక్సభ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఏడో విడత బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జూన్ 1న ఏడో విడతలో పోలింగ్ జరగనున్న క్రమంలోనే బిహార్లోని ఓ కుటుంబం చర్చనీయాంశమైంది. ఒక కుటుంబమే కదా ఏముందని అనుకుంటున్నారా? ఆ ఒక్క కుటుంబంలోనే 165మంది సభ్యులు ఉన్నారు మరి. ఆ కుటుంబ సభ్యులను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులకు చెందిన అనుచరులు వారి ఇంటిచుట్టూ తిరుగుతున్నారట. మరి ఆ ఫ్యామిలీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
చందేల్ కుటుంబ సభ్యులు (ETV Bharat) అందరూ చర్చించి!
పట్నా నగరంలోని 'చందేల్ నివాస్' అనే ఇంట్లో 165మంది నివసిస్తున్నారు. ఇక ఈ కుటుంబంలో 110మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి 10మందికి కొత్తగా ఓటు హక్కు వచ్చింది. అందులో నలుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. వీరంతా విద్యావంతులు, రాజకీయాలపై అవగాహన కలిగిన పౌరులు. ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేయడానికి ముందు అభ్యర్థుల గురించి చర్చిస్తారు. అనంతరం ఒక అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి వచ్చి 70 నుంచి 80 శాతం మంది అతడికి ఓటు వేస్తారు. అయితే ఏకీభవించని మిగతా వారు వేరే అభ్యర్థికి ఓటు వేస్తారు. ప్రస్తుతం పట్నాలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
చందేల్ కుటుంబ సభ్యులు (ETV Bharat) ఓటు బ్యాంకు
స్థానిక నాయకులు చందేల్ కుటుంబాన్ని ఓ ఓటు బ్యాంకుగా భావిస్తారు. దీంతో ఎన్నికల సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల మద్దతుదారులు, తమ నాయకుడికే ఓటేయాలని చందేల్ కుటుంబం చుట్టూ తిరుగుతారు. వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు.
"ఓటు వేసే ముందు కుటుంబ అభిప్రాయాన్ని తీసుకోవాలి. కానీ నా ఓటు మాత్రం అభివృద్ధికే. ఇక్కడ ధరలు పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. మహిళల భద్రత సమస్య కూడా ఉంది.''
- కల్పనా సింగ్, చందేల్ కుటుంబ సభ్యురాలు
భిన్నాభిప్రాయాలు
తాను కుటంబ విశ్వాసాలను పాటిస్తానని, అందుకే కుటుంబం చెప్పిన వారికే తాను ఓటు వేస్తానని చెబుతున్నారు చందేల్ కుటుంబంలోని మరో మహిళ సుమన్ సింగ్. ఇక తొలిసారి ఓటు వేయబోతున్న అనుష్క కుమారి, తన మొదటి ప్రాధాన్యం విద్యకే అని చెబుతోంది. బిహార్లో విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపింది. మరోవైపు, మహిళా భద్రత విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం చాలా కృషి చేసిందని, పాఠశాలల పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా మారిందని మరో సభ్యురాలు అభా సింగ్ చెప్పింది.
అభా సింగ్, చందేల్ కుటుంబ సభ్యురాలు (ETV Bharat) కల్పనా సింగ్, చందేల్ కుటుంబ సభ్యురాలు (ETV Bharat) అనుష్క కుమారి, ఫస్ట్ టైమ్ ఓటర్ (ETV Bharat) 'స్థానిక సమస్యలకు ప్రాధాన్యం'
స్థానికంగా మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్లో బోధించే చందేల్ కుటుంబ సభ్యుడు శివేంద్ర సింగ్, ఈ ప్రాంతంలో స్థానిక ప్రజాప్రతినిధి అందుబాటులో లేరని, రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడం, డ్రైడేజీ లైన్లు పగిలిపోవడం, పరిశుభ్రత వ్యవస్థ సరిగా లేదని వాపోయాడు. ఓటు వేసేటప్పుడు వీటి గురించి ఆలోచిస్తానని తెలిపాడు.
" దేశ హితం, అభివృద్ధికే నేను ఓటు వేస్తాను. అయితే ప్రస్తుత లోక్సభ ఎన్నికల సమయంలో ఏకాభిప్రాయం ఏర్పడినా, ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసే స్వేచ్ఛ ఉంది. కానీ అసెంబ్లీ, నగర పంచాయతీ ఎన్నికల జరిగినప్పుడు మాత్రం కుటుంబంలోని సభ్యులందరి ఓట్లు ఒకే అభ్యర్థికి వెళతాయి."
--అమిత్ గౌతమ్, చందేల్ కుటుంబ సభ్యుడు
'మే 31న నిర్ణయిస్తాం'
ఇంకా అభ్యర్థులు ఎవరూ తమ ఇంటికి రాలేదని సీనియర్ కుటుంబ సభ్యుడు అరుణ్ కుమార్ సింగ్(74) తెలిపారు. అభ్యర్థుల స్థానిక అనుచరులు వస్తారని చెప్పారు. మే 31న తామందరం సమావేశమై అభ్యర్థిపై ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు.
చందేల్ కుటుంబ సభ్యులు (ETV Bharat) కుటుంబ నేపథ్యం
అరుణ్ కుమార్ సింగ్ తండ్రి వైశాలి జిల్లాలోని రాఘోపుర్కు చెందిన వారు. అరుణ్ తండ్రికి ఓ సోదరుడు ఉన్నాడు. వారిద్దరూ వ్యవసాయం చేసేవారు. అయితే గ్రామంలో వ్యవసాయ భూమి అమ్మి 1974లో సోదరులిద్దరూ పట్నా వచ్చారు. అనంతరం ఇద్దరూ కలిసి స్థలం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. వారిద్దరి సంతానమే ఇప్పుడు చందేల్ నివాసంలో నివసిస్తోంది. ఈ కటుంబంలోని 165 మందిలో 35మంది ఇంటికి దూరంగా ఉన్నారు. కొందరు విదేశాల్లో ఉన్నారు. మరికొందరి వృత్తి, ఉద్యోగాల రీత్యా ముంబయి, దిల్లీ, నొయిడా వంటి నగరాల్లో నివసిస్తున్నారు. ఈ కుటుంబంలో 24మంది ఇంజినీర్లు, ఇద్దరు డాక్టర్లు, నలుగురు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 20మందికి పైగా కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. పలువురు మహిళలు కూడా స్థానికంగా ఉపాధి పొందుతున్నారు.