Woman Got Job due to Skill Development Corporation: చంద్రబాబు మచ్చలేని మనిషి.. మా కోచింగ్ ఖర్చు తిరిగి ఇచ్చేందుకు సిద్ధం: భావన - social media post on chandrababu arrest
🎬 Watch Now: Feature Video
Published : Sep 11, 2023, 8:24 PM IST
|Updated : Sep 11, 2023, 8:31 PM IST
Woman Got Job due to Skill Development Corporation: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుని కేవలం కక్షపూరితంగానే ఇరికించారని.. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన అబ్బూరి భావన అన్నారు. కేవలం ఆయన్ని రాజకీయంగా అణగదొక్కడానికి ఇలాంటి చర్యలు చేపట్టారని ఆమె అన్నారు. యువతకు ఉపాధి కల్పించడానికి సాఫ్ట్‌వేర్‌ని హైదరాబాద్ తీసుకొచ్చిన చంద్రబాబు.. పిల్లలకు ఉపయోగపడే వాటిలో ఎందుకు దోచుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఆ 375 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేందుకు కూడా ఆయన ద్వారా లబ్ధి పొందిన వారు సిద్ధంగా ఉన్నారన్నారు.
‘‘చంద్రబాబుపై పడిన అపనిందను తొలగించేందుకు, నా ఇద్దరు కుమార్తెల స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చును కట్టేస్తాం’’ అంటూ ఓ వ్యక్తి ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తిరుపతికి చెందిన అబ్బూరి శ్రీనివాసులుకు చెందిన ఆ పోస్టులో ఉన్న విషయాలు చంద్రబాబు అరెస్టు అక్రమమని చెప్పడానికి నిదర్శనంగా ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అబ్బూరి శ్రీనివాసులు ఫేస్‌బుక్ పోస్ట్‌లో... ‘‘బీటెక్ చదివేటప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ పొందిన తర్వాత నా పెద్ద కుమార్తె, ఇతర విద్యార్థినులు 2017 ఏప్రిల్‌లో అమరావతికి వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని, నాటి మంత్రి కొల్లు రవీంద్రని కలిసినప్పటి ఫొటోలివీ. నా చిన్న కుమార్తె బీబీఏ చదివేటప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ తీసుకుంది. ఇప్పటి ప్రభుత్వం అంటున్న ఆ రూ.370 కోట్ల నుంచే నా ఇద్దరు కుమార్తెలు శిక్షణ తీసుకున్నారు. ఆ సొమ్ము చంద్రబాబు దోచుకుని ఉంటే నా కుమార్తెలకు శిక్షణ ఎవరి డబ్బుతో ఇచ్చారు?’’ అంటూ ప్రశ్నించారు.
‘‘కావాలంటే నా కుమార్తెల శిక్షణకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెబితే.. నేను కట్టేస్తాను. ఆ మొత్తం నుంచి నేను కట్టే సొమ్మును మినహాయించండి. ఎంతో మంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయి మంచి జీతాలతో ఉద్యోగాలు చేయగలిగే పరిస్థితి కల్పించిన ఆ మహానుభావుడు చంద్రబాబు. నా కుమార్తెల లాంటి వారి భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టిన సొమ్మును దోచుకున్నాడనే మచ్చ రావడం నాకు, నా కుమార్తెలకు, నా భార్యకు చాలా బాధను కలిగిస్తోంది’’ అని రాసుకొచ్చారు.
అబ్బూరి శ్రీనివాసులు పోస్ట్‌కు ఫేస్‌బుక్‌లో నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. మీరు చెప్పింది నిజమే, చంద్రబాబు అలాంటి తప్పు చేయరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ తీసుకొని ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, మంచి స్థానంలో ఉన్నవాళ్లు చంద్రబాబుకు అండగా నిలవాలని నెటిజన్లు కోరుతున్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ పొందిన యువతి భావనతో మా ప్రతినిధి సతీశ్ ముఖాముఖి.