Tomato Theft Sangareddy : టమాట దొంగ.. హెల్మెట్ పెట్టుకుని మరీ చోరీ - Tomato price today
🎬 Watch Now: Feature Video
Tomato Theft In Sangareddy : దేశవ్యాప్తంగా టమాటాల ధరలు మండిపోతున్నాయి. కొన్ని చోట్ల వీటి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సామాన్యులు టమాటాలు కొనడం కష్టంగా మారింది. ధర పెరగడం వల్ల టమాట దొంగతనాలు కూడా పెరిగాయి. ఎంతలా అంటే.. ఒకప్పుడు బంగారం, విలువైన వస్తువులు, డబ్బులు దొంగిలించేవారు. కానీ ఇప్పుడు టమాటాలు దొంగలిస్తున్నారు. దానికి కారణం పెరిగిన ధరలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత నెలలో నిజామాబాద్లో ఫ్రిజ్లో నుంచి కిలో టమాటాలను దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.
తాజాగా మరోచోట ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని మరీ టమాటాలను దొంగిలించాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత రైతు చెప్పిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఓ రైతు కమీషన్ ఏజెంట్ దుకాణానికి టమాటాలను తీసుకొచ్చి నిల్వ ఉంచాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి.. ముఖం కనిపించకుండా.. హెల్మెట్, జాకెట్ ధరించి కూరగాయల దుకాణంలోని మూడు టమాటా ట్రేలను దొంగలించాడు. ఈ దృశ్యాలు సీసీకెమెరాలో నమోదయ్యాయి. చోరీ జరిగిన మూడు టమాట ట్రేల విలువ రూ.6,500 వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై కమీషన్ ఏజెంట్, రైతు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.