విశ్వనగరంలో ఈ స్థాయిలో వీధి కుక్కల బెడదకు కారణాలేంటి?
🎬 Watch Now: Feature Video
Prathidwani: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వీధి కుక్కలు... నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి... చంపేయడం అందరి మనసుల్ని కలచివేస్తోంది. అభంశుభం తెలియని నాలుగేళ్ల బాలుడు.. కుక్కలకు బలి అయ్యాడు. అది కూడా రాజధాని నగరం నడివీధుల్లో. నాన్న పనిలో ఉండగా... దగ్గర్లో ఉన్న అక్క దగ్గరకు వెళ్లాలని అనుకోవడమే ఆ బాలుడి పాలిట శాపమైంది. ఉన్నట్టుండి వీధి కుక్కలు వెంటపడటంతో బెదిరిపోయాడు. అయినా వాటి బారి నుంచి తప్పించుకునేందుకు శక్తిమేర ప్రయత్నించాడు. కానీ... కుక్కలన్నీ ఆ చిన్నారిపై అన్ని వైపుల నుంచి దాడిచేయడంతో నిస్సహాయంగా శరీరాన్ని వాటికి అప్పగించి ప్రాణాలు కోల్పోయాడు.
అభంశుభం తెలియని బాలుడు... శునకాలకు బలైపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు... గుండెలవిసేలా విలపిస్తున్నారు. క్షణక్షణం గుర్తుకొస్తున్న జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ... కన్నపేగు తల్లడిల్లుతోంది. తమ లాంటి పరిస్థితి రాష్ట్రంలో మరేవరికి రాకూడదని... బాలుడి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ కుమారుడికి జరిగినట్లు మరే చిన్నారికీ జరగకూడదని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో తరచూ కుక్కల దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏ కాలనీలో చూసినా ఎక్కడ పడితే అక్కడ శునకాలు దర్శనమిస్తున్నాయి. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా ఉండటానికి జీహెచ్ఎంసీ పరిధిలోని పశు సంవర్ధక విభాగం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాలనీల్లో వీధి కుక్కల సంతానోత్పత్తి పెరగకుండా వాటికి శస్త్ర చికిత్సలు నిర్వహించాలి. కొన్ని స్వచ్ఛంద సంస్థలకు కూడా అధికారులు ఈ బాధ్యత అప్పజెప్పారు. కాలనీల్లో తిరుగుతూ వీధి కుక్కలను బంధించి, సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ సంబంధిత శాఖాధికారులు సరైన చర్యలు తీసుకోవడంలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. నగరంలో 5లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఇందులో సగానికిపైగా కుక్కలకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశ్వనగరంగా పురోగమిస్తున్న భాగ్యనగరంలో పౌరభద్రతపై బాగ్ అంబర్ పేటలో జరిగిన విషాదం ఏం సందేశం ఇస్తోంది ? బాలుడి కుటుంబానికి మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సరే.. అలాంటి కన్నీటికష్టం మరొకరికి రావొద్దంటే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.